Share News

Neuralink: పక్షవాత వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. న్యూరాలింక్ చిప్ ట్రయల్ సక్సెస్..

ABN , Publish Date - May 18 , 2024 | 05:00 PM

టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) క్రేజీ ప్రాజెక్ట్ న్యూరాలింక్(Neuralink). ఏళ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. న్యూరాలింగ్ సంబంధించి ఎలాన్ మస్క్ శనివారం గుడ్ న్యూస్ చెప్పారు.

Neuralink: పక్షవాత వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. న్యూరాలింక్ చిప్ ట్రయల్ సక్సెస్..

న్యూయార్క్: టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) క్రేజీ ప్రాజెక్ట్ న్యూరాలింక్(Neuralink). ఏళ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. న్యూరాలింగ్ సంబంధించి ఎలాన్ మస్క్ శనివారం గుడ్ న్యూస్ చెప్పారు. పక్షవాతం వచ్చిన రోగుల్లో న్యూరాలింక్ అద్భుతంగా పని చేస్తోందని, పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తులకు శరీర నియంత్రణను పునరుద్ధరించడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన వెల్లడించారు. ఫస్ట్ ట్రయల్ సక్సెస్ కావడంతో న్యూరాలింక్ చిప్ ఇంప్లాంట్ కోసం రెండో వ్యక్తి నుంచి దరఖాస్తులను కోరుతోంది.

న్యూరాలింక్ అంటే..

మనం ఏ పని చేయాలన్నా, బ్రెయిన్ సహా, చేతులు, కాళ్లు ఇతర అవయవాలు సైతం వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా మన ఆలోచనలే అద్భుతాలు సృష్టిస్తే ఎలా ఉంటుంది. మానవ మెదడులో ఉన్న ఆలోచనలను ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేసి వాటిని ఆదేశాలుగా మలిచి నియంత్రించే ప్రయోగమే న్యూరాలింక్. ఈ రిసర్చ్ ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమయింది.

2016 లో న్యూరాలింక్ అనే సంస్థను స్థాపించి ఈ ప్రయోగాలు ప్రారంభించారు. పక్షవాతంతో అవయవాల కదలికలు కోల్పోయిన బాధితులు ఈ చిప్ సాయంతో తమ ఆలోచనల ద్వారానే స్మార్ట్ ఫోన్‌ను వేగంగా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. వెన్నుపాము బలహీనత లేదా క్వాడ్రిప్లెజియా వంటి తీవ్రమైన శారీరక లోపాలున్న రోగులతో కలిసి పనిచేయడం ద్వారా కంపెనీని ప్రారంభిస్తామని గతంలోనే మస్క్ ప్రకటించారు.


చిప్‌ను అమర్చిన రోగి నోలాండ్ అర్బాగ్.. కంప్యూటర్‌ను ఉపయోగించి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడాడు. 29 ఏళ్ల ఆర్బాగ్‌కు ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో వెన్నుముకకు గాయమైంది. అర్బాగ్ మారియో కార్ట్‌ను ప్లే చేయడానికి బ్రెయిన్ చిప్‌ను ఉపయోగించాడు. ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి సాంకేతికత తనకు సహాయపడిందని హర్షం వ్యక్తం చేశాడు. పగలు, రాత్రి అన్ని వేళల్లో తన కుటుంబం అవసరం లేకుండా మళ్లీ స్వయంగా తన పనులు తానే చేసుకోగలుగుతున్నట్లు చెప్పాడు.


పక్షపాతంతో బాధపడుతున్న రోగులందరికీ ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపాడు. జనవరిలో న్యూరాలింక్ ప్రక్రియ విజయవంతమైన మర్నాడే ఆసుపత్రి నుంచి ఆర్బాగ్ డిశ్చార్జీ అయ్యాడు. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్‌ -కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌(BCI)’ ప్రయోగాలకు అమెరికా ప్రభుత్వం 2023 మేలో ఆమోదం తెలిపింది.

న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల వంటి జంతువుల్లో సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేశారు. ఇది సురక్షితమైన విధానమని మస్క్ చెబుతున్నారు. ఈ పరికరం దృష్టిని పునరుద్ధరించే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని గతంలో మస్క్ అభిప్రాయపడ్డారు. పక్షవాతం ఉన్న రోగులకు టెలిపతి తర్వాత అత్యంత ప్రభావంతమైన విధానమని వ్యాఖ్యానించారు.

Read Latest News and Technology News here

Updated Date - May 18 , 2024 | 05:05 PM