Rajya Sabha: సింఘ్వీని రాజ్యసభకు పంపింది అందుకే!
ABN , Publish Date - Oct 11 , 2024 | 03:17 AM
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ప్రాతినిధ్యం వహించడం మన రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన్ను ఎన్నుకున్నాం
చట్టసభలు, కోర్టుల్లో తన వాణిని బలంగా వినిపిస్తారు
సింఘ్వీ సన్మాన సభలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ప్రాతినిధ్యం వహించడం మన రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని అతికొద్ది మంది నిష్ణాతులైన న్యాయవాదుల్లో సింఘ్వీ ఒకరని కొనియాడారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో సింఘ్వీకి మాజీ ఎంపీ గిరీష్ సంఘీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తరఫున సింఘ్వీ రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షం గర్వంగా భావిస్తోందన్నారు. ఆయనకు ఓటు వేసి, రాజ్యసభకు పంపే అవకాశం తమకు లభించినందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. సింఘ్వీ వాదనలు వినడానికే చాలామంది కోర్టుకు వస్తారన్నారు.
ఆయన చరిత్రాత్మక కేసులెన్నింటినో వాదించారని, ప్రజాహిత చట్టాలను నిలబెట్టడం కోసం పోరాడారని చెప్పారు. అత్యున్నత న్యాయవాదుల్లో ఒకరైన ఆయన.. మన రాష్ట్రం తరఫున పెద్దల సభలో గొంతు వినిపించబోతున్నారని తెలిపారు. మన వాదనలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడమేగాక, కోర్టుల్లో కూడా బలంగా వాదించి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే గొంతు కోసం చూస్తే.. సింఘ్వీ తప్ప మరొకరు కనిపించలేదని చెప్పారు. విభజన చట్టంలో కొన్ని అంశాలు కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్నాయని, అటు చట్టసభలు, ఇటు న్యాయస్థానాల్లో రాష్ట్ర ప్రయోజనాల గురించి గట్టిగా ప్రశ్నిస్తారనే నమ్మకంతోనే తాము ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన్ని ఆహ్వానించినట్లు తెలిపారు. సింఘ్వీ మాట్లాడుతూ.. రాజ్యసభలో తాను, గిరీష్ సంఘీ బెంచ్‌మేట్స్ అన్నారు. రాజ్యసభకు ఎన్నిక కావడం ఇది నాలుగోసారన్న ఆయన.. గతంలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించానని, ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్లానని చెప్పారు. తెలంగాణ ఆత్మీయత తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు.