ఎక్కడైనా సరే.. కరెంట్ వైర్లు పట్టుకుని చూడండి
ABN , Publish Date - Feb 28 , 2024 | 05:25 AM
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని చెప్పిన బీఆర్‌ఎస్ నేతలు ఇపుడు రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్లి తీగలు పట్టుకుని చూడాలని..

విద్యుత్తు ఉందో లేదో తెలుస్తుంది: డిప్యూటీ సీఎం భట్టి
తప్పుడు కూతలు కూస్తే మట్టికొట్టుకుపోతారు: సీతక్క
సంజయ్ ఖబడ్డార్.. : శ్రీధర్‌బాబు
పేదలకు న్యాయం: పొంగులేటి
జన జాతర’ సభలో మంత్రుల ప్రసంగం
చేవెళ్ల/మెయినాబాద్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని చెప్పిన బీఆర్‌ఎస్ నేతలు ఇపుడు రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్లి తీగలు పట్టుకుని చూడాలని.. కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిందని ఆరోపించారు. చేవెళ్ల- ప్రాణహిత అవసరం లేదని కాళేశ్వరం కట్టారని, అద్భుతాలు సృష్టించామని చెప్పారని.. ఇపుడు ఏమైందని ప్రశ్నించారు. మేడిగడ్డ నిట్టనిలువనా చీల్చిపోయిందన్నారు. ప్రగల్భాలు పలికి రూ.లక్ష కోట్లను గోదావరిలో పోశారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం జరిగిన ‘జన జాతర’ సభలో భట్టి మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ‘గ్యారెంటీలు’ అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందని.. మాట నిలబెట్టుకోవాలనే కృతనిశ్చయంతో సీఎం రేవంత్, మంత్రివర్గ సహచరులందరం ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఓట్ల కోసం బీజేపీ మతాలు, కులాలను రెచ్చగొట్టాలని చూస్తోందని.. అది తెలంగాణలో సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడవక ముందే ఇబ్బందులు పెట్టేయత్నాలు చేస్తున్నారని.. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
80 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలను అమలు చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 70 లక్షల స్వయం స్వహాయక సంఘాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు అన్ని విదాల న్యాయం జరుగుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆపోహాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. 17 ఎంపీ సీట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర మాజీ అఽధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని ఇదేనా ఆ పార్టీ సంస్కృతి అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఇష్జారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని సంజయ్ ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మతి కోల్పోయి దుష్ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. తమ ఫ్రభుత్వం ఏర్పడి నాలుగు రోజుల గడవకముందే ప్రతిపక్షాలు అపశకునాలు పెడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రె్‌సను ముట్టుకునే ప్రయత్నం చేస్తే మసైపోతారని చెప్పాలని కార్యకర్తలను కోరారు. ప్రజా పాలనను చూసి బీఆర్‌ఎస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. తప్పుడు కూతలు కూసేవారు మట్టికొట్టుకుపోతారన్నారు.