Share News

Financial Year Market Performance: రూ.26 లక్షల కోట్లు

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:56 AM

2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందు, ఈక్విటీ మదుపరుల సంపద రూ.25.90 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5.10%, నిఫ్టీ 5.34% వృద్ధి సాధించాయి, అయితే గత ఆర్థిక సంవత్సరం సెన్సెక్స్‌ 24.85% వృద్ధి సాధించింది

Financial Year Market Performance: రూ.26 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన మార్కెట్‌ సంపద ఇది..జూ సెన్సెక్స్‌ 5 శాతం వృద్ధితో సరి

ముంబై: ఈ మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీ మదుపరుల సంపద రూ.25.90 లక్షల కోట్లు పెరిగింది. బీఎ్‌సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 3,763.57 పాయింట్లు (5.10 శాతం), నిఫ్టీ 1,192.45 పాయింట్లు (5.34 శాతం) వృద్ధిని నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారీ రిటర్నులు పంచిన స్టాక్‌ మార్కెట్‌.. 2024-25లో మాత్రం తీవ్ర ఒడుదుడుకులను చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో సెన్సెక్స్‌ 14,659.83 పాయింట్లు (24.85 శాతం) పుంజుకోగా.. ఈక్విటీ మదుపరుల సంపద రికార్డు స్థాయిలో రూ.128.77 లక్షల కోట్ల మేర పెరిగింది.

2024-25కు నష్టాలతో వీడ్కోలు

ఈ ఆర్థిక సంవత్సరానికి మార్కెట్‌ సూచీలు నష్టాలతో వీడ్కోలు పలికాయి. వాహన రంగంపై ట్రంప్‌ సుంకాల ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది. దాంతో మన దలాల్‌ స్ట్రీట్‌ ఇన్వెస్టర్లూ అమ్మకాలకే మొగ్గుచూపారు. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 191.51 పాయింట్ల నష్టంతో 77,414.92 వద్ద ముగియగా.. నిఫ్టీ 72.60 పాయింట్లు కోల్పోయి 23,519.35 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ సంపద రూ.412.87 లక్షల కోట్ల (4.82 లక్షల కోట్ల డాలర్లు) వద్ద ముగిసింది.


ప్రథమార్ధంలో జోరు.. ద్వితీయార్ధంలో బేజారు

ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లోనూ మార్కెట్ల జోరు కొనసాగింది. తొలి ఆరు నెలల్లో సూచీలు 17 శాతం పెరిగాయి. గత ఏడాది సెప్టెంబరు 27న సెన్సెక్స్‌ 85,978.25 పాయింట్ల వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని తాకింది. కానీ, దీర్ఘకాలిక బుల్‌రన్‌ కారణంగా చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతుండటం, అంతర్జాతీయ అనిశ్చితులు, కార్పొరేట్‌ కంపెనీల నిరాశాజనక త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబరు నుంచి మన మార్కెట్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారు. దాంతో ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మార్కెట్‌ తీవ్ర ఒత్తిడికి లోనైంది. గత 29 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఐదు నెలలు (అక్టోబరు-ఫిబ్రవరి) ప్రామాణిక సూచీలు భారీగా దిద్దుబాటుకు లోనయ్యాయి. కేవలం అక్టోబరులోనే సెన్సెక్స్‌ 4,910.72 పాయింట్లు (5.82 శాతం) క్షీణించింది. ఈ ఏడాదిలో ట్రంప్‌ సుంకాల మోత మార్కెట్‌ను మరింత కుంగదీసింది. అయినప్పటికీ, రిటైల్‌ మదుపరులు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల దన్నుతో సూచీలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక అంకె వృద్ధిని మాత్రమే నమోదు చేయగలిగాయి.


2024-25లో 2 శాతం క్షీణించిన రూపాయి

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం 24 పైసలు పెరిగి రూ.85.50 వద్ద ముగిసింది. మన ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులు పెంచడం ఇందుకు దోహదపడింది. ఈ నెలలో రూపాయి మారకం విలువ 2.17 శాతం పెరిగింది. గడిచిన ఆరేళ్లకు పైగా కాలంలో మన కరెన్సీకిదే అత్యుత్తమ వృద్ధి. 2018 నవంబరులో రూపాయి 5 శాతానికి పైగా బలపడింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూపీ మారకం విలువ 2 శాతానికి పైగా క్షీణించింది. ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్‌ సెషన్‌ అయిన ఏప్రిల్‌ 2న డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.83.42గా నమోదైంది.

2025-26లోనూ కొనసాగనున్న అంతర్జాతీయ అనిశ్చితులు

దేశీయంగా పటిష్ఠ ఆర్థిక మూలాలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలతో పాటు కార్పొరేట్‌ కంపెనీల పనితీరు మళ్లీ పుంజుకోనుందన్న అంచనాలు ఈ ఏప్రిల్‌ 1 తో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్కెట్లకు సానుకూలంగా పరిణమించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ట్రంప్‌ సుంకాలతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు తీవ్రతరమయ్యే ప్రమాదంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పశ్చిమాసియా నుంచి యూర్‌పనకు మళ్లే అవకాశాలు మార్కెట్లకు ప్రతికూలంగా పరిణమించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 06:57 AM