Bhatti Vikramarka: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Nov 21 , 2024 | 03:49 AM
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వ్యయంపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వ్యయానికి సంబంధించి 32 శాఖల పనితీరుపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
30 రోజుల్లోగా సమర్పించాలి.. అధికారులకు భట్టి ఆదేశాలు
ప్రైవేటు కాలేజీల సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని భరోసా
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వ్యయంపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వ్యయానికి సంబంధించి 32 శాఖల పనితీరుపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, వ్యయాలు, గతేడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ప్రతి శాఖలో ఒక సపోర్ట్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అన్ని శాఖల్లో సబ్ ప్లాన్ నిధుల వ్యయాన్ని ఇక నుంచి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వ్యయంపై అన్ని శాఖలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గిరిజన తండాలకు త్రీ ఫేజ్ విద్యుత్తును సరఫరా చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికారులు తదనుగుణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున... వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయడానికి అన్ని శాఖల వారు కొత్త పథకాలను రూపొందించి, ఆర్థిక శాఖకు సమర్పించాలన్నారు. ఈ కొత్త పథకాల కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా ఓ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ప్రైవేటు కళాశాలల యజమానుల సంఘం సభ్యులతో భట్టి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రైవేటు ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల సమస్యల పట్ల ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని, దశల వారీగా వాటిని పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.