Share News

Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి

ABN , Publish Date - Oct 16 , 2024 | 04:01 AM

ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శులతో మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి

  • కార్యదర్శులు గురుకులాలను సందర్శించాలి

  • అద్దె భవనాల కిరాయి బిల్లులను చెల్లించండి

  • మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలను పెంచండి

  • అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శులతో మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. విద్యాలయాల్లో బోధన తీరుపై నిపుణులతో పరిశీలన జరిపించాలని, అనంతరం ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇప్పించాలని చెప్పారు. విద్యార్థుల మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని, అధికారులు ఈ విషయాలకే పరిమితం కాకుండా బోధనలో నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులు రోజూ ఒక విద్యాలయాన్ని సందర్శించి, పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. ఒక పూట అక్కడే ఉండి అన్ని విషయాలను సమీక్షించాలని ఆదేశించారు. కార్యదర్శులు ఎన్ని విద్యాసంస్థలను సందర్శించారు.. ఏ ఏ అంశాలను గమనించారు.. ఎలాంటి చర్యలు చేపట్టారు? అన్న వివరాలతో ఈ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలన్నారు.


కార్యదర్శులు పర్యటించి సమస్యలు పరిష్కరించడం ద్వారా సిబ్బందికి భరోసా ఏర్పడుతుందని చెప్పారు. అద్దె భవనాల్లో ఉన్న గురుకుల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అద్దె భవనాల యజమాలతో మాట్లాడి, భవనాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేలా చూడాలని, కిరాయి బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. గురుకులాలను సందర్శించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారమిచ్చామని, వారు సందర్శించే సమయాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు. పెరుగుతోన్న ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ దృష్ట్యా అధికారులు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని మెస్‌ చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వీటితో పాటు కాస్మెటిక్‌ చార్జీలు, ట్యూటర్ల చార్జీల పెంపుపైనా నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో అధికారులు కె.రామకృష్ణారావు, సందీ్‌పకుమార్‌ సుల్తానియా, బుర్ర వెంకటేశం, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులు సైదులు, తఫ్సీల్‌ ఇక్బాల్‌, సీతాలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2024 | 04:01 AM