Share News

Hyderabad: ఏపీకి వెళ్లండి!

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:13 AM

ఏపీ కేడర్‌ కేటాయింపు జరిగినా.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎ్‌సలు, ఇద్దరు ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్‌ ఇచ్చింది.

Hyderabad: ఏపీకి వెళ్లండి!

3.jpg

  • ఐదుగురు ఐఏఎస్‌, ఇద్దరు ఐపీఎస్‌లకు డీవోపీటీ ఆదేశం

  • ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఐఏఎస్‌లు తెలంగాణకు..

  • తెలుగు రాష్ట్రాల మధ్యన ఏఐఎస్‌ అధికారుల సర్దుబాటు

  • 16వ తేదీలోగా రిపోర్ట్‌ చేయాలంటూ స్పష్టీకరణ

  • తెలంగాణకు వస్తామన్న రావత్‌, అనంతరాములుకు నో..

  • ఏపీకి వెళ్లాల్సినవారిలో ఆమ్రపాలి, రోనాల్డ్‌రాస్‌, వాణీ

  • ప్రసాద్‌, కరుణ, ప్రశాంతి, అంజనీకుమార్‌, అభిలాష బిస్త్‌

హైదరాబాద్‌, అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఏపీ కేడర్‌ కేటాయింపు జరిగినా.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎ్‌సలు, ఇద్దరు ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రంలో పని చేయాల్సిందేనని, పక్క రాష్ట్రంలో విధులు కుదరదని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు తెలంగాణ కేడర్‌ ఐఏఎ్‌సలకూ ఇదే వర్తిస్తుందని పేర్కొంది. ఈ నెల 16వ తేదీలోపు సొంత కేడర్‌ రాష్ట్రంలో చేరిపోవాలని ఆదేశాలిచ్చింది. దీనిప్రకారం.. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్‌ ఐఏఎ్‌సలు ఆమ్రపాలి కాట, రోనాల్డ్‌రాస్‌, మల్లెల ప్రశాంతి, వాణీప్రసాద్‌, వాకాటి కరుణతో పాటు ఐపీఎ్‌సలు అంజనీకుమార్‌, అభిలాష బిస్త్‌ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.


విభజన సమయంలో తెలంగాణకు కేటాయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయవాడ కలెక్టర్‌, 2013 బ్యాచ్‌కు చెందిన కె.సృజన, కడప కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి (2013), ఏపీ ప్రజారోగ్య శాఖ సంచాలకుడు సీహెచ్‌ హరికిరణ్‌ (2009) తెలంగాణకు రానున్నారు. కాగా, ఆమ్రపాలి కాటా ప్రసుత్తం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈమె 2010 బ్యాచ్‌ కు చెందినవారు. వాణిప్రసాద్‌ (1995) అటవీ శాఖ కార్యదర్శిగా, వాకాటి కరుణ (2004) మహిళా, శిశు సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మిగతా ఇద్దరు.. డి.రోనాల్డ్‌రాస్‌ 2006వ బ్యాచ్‌, మల్లెల ప్రశాంతి 2009 బ్యాచ్‌కు చెందినవారు. ప్రశాంతి ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. కాగా, తమను తెలంగాణకు కేటాయించాలన్న ఏపీ కేడర్‌ ఐఏఎ్‌సలు ఎస్‌ఎస్‌ రావత్‌, అనంతరాము విజ్ఞాపనను డీవోపీటీ తిరస్కరించింది. ఐదుగురు ఐఏఎ్‌సలను దసరా అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్‌ చేయనుంది.


  • ఇదీ నేపథ్యం..

రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు ప్రత్యూష్‌ సిన్హా కమిటీని కేంద్రం వేసిన విషయం విదితమే. ఈ కమిటీ స్థానితకను పరిశీలించి విభజనకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆప్షన్లు కూడా తీసుకుంది. వాటి పరిశీలన అనంతరం అఖిల భారత సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకే ప్యానల్‌ ఇయర్‌కు చెందిన అధికారులు స్వాపింగ్‌ ద్వారా కేడర్‌ను మార్చుకోవడానికి వీలు కల్పించింది. ఆ వీలుతో ప్రాథమిక కేటాయింపులో ఏపీకి వెళ్లిన సందీ్‌పకుమార్‌ సుల్తానియా, తెలంగాణకు కేటాయించిన నటరాజన్‌ గుల్జార్‌లు స్వాపింగ్‌ను వినియోగించుకున్నారు.


గుల్జార్‌ ఏపీకి వెళ్లగా... సుల్తానియా తెలంగాణకు వచ్చారు. ఇక ఏపీ ఎన్నికల కమిషన ర్‌గా పనిచేస్తున్న ముకే్‌షకుమార్‌ మీనా కూడా తెలంగాణ లో ఉండాలని శతవిధాలా ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వం ఆయన విజ్ఙప్తిని అనుకూలంగా పరిశీలించలేదు. దాంతో ఆయన ఏపీకి వెళ్లిపోయారు. గత ప్రభుత్వ ఆశీస్సులతో ఆమ్రపాలి సహా కొంతమంది అధికారులు 2015లో క్యాట్‌ను ఆశ్రయించారు. వీరి వాదనలు విన్న క్యాట్‌.. తెలంగాణలోనే కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 2017లో తెలంగాణ హైకోర్టులో కేంద్రం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ఈ ఏడాది జనవరి 3న తీర్పు వెలువరించింది. ప్రత్యూ్‌షసిన్హా కమిటీ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని చెప్పింది. ఆ కమిటీ సిఫారస్సులకు అనుగుణంగా ఐఏఎ్‌సల దరఖాస్తులను పునఃపరిశీలించాలని పేర్కొంది.


రెండో అంశంగా.. ఈ ఐఏఎ్‌సల విజ్ఙప్తులు/వినతులను వ్యక్తిగతంగా వినడానికి అవకాశం ఇవ్వాలని నిర్దేశించింది. హైకోర్టు ఆదేశాలతో కేంద్రం డీవోపీటీ మాజీ కార్యదర్శి దీపక్‌ ఖండేల్కర్‌ నేతృత్వంలో ఈ ఏడాది మార్చి 21న కమిటీ వేసింది. తెలంగాణలోనే కొనసాగాలని నిర్ణయించుకుంటున్న అధికారుల నుంచి విజ్ఙప్తులను పంపించాలని డీవోపీటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అధికారులు గత జూన్‌లో ఖండేల్కర్‌ ముందు హాజరై.. కేడర్‌ కేటాయింపులో హేతుబద్ధత లేద ని, తమ వాదనలు డీవోపీటీ వినలేదని, విభజన మార్గదర్శకాలు సరిగ్గా లేవని, తెలంగాణలోనే కొనసాగించాలని కోరారు. వీటిని, ప్రత్యూష్‌సిన్హా కమిటీ మార్గదర్శకాలను పరిశీలించిన ఖండేల్కర్‌ కమిటీ.. ఐఏఎ్‌సల విజ్ఙప్తులను తోసిపుచ్చింది. ఖండేల్కర్‌ నివేదికను ఆమోదిస్తూ డీవోపీటీ తుదినిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి లేఖ రాసింది.


  • సోమేశ్‌ కుమార్‌ వ్యవహారంతోనే..

పదేళ్లుగా ఐదుగురు ఐఏఎ్‌సలు తెలంగాణలో పనిచేస్తున్నప్పటికీ డీవోపీటీ రికార్డుల్లో ఏపీ కేడర్‌లోనే ఉన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వ్యవహారంతోనే వీరు కేడర్‌ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. కేంద్ర కృతనిశ్చయం, కోర్టు తీర్పు అనంతరం సోమేశ్‌ను ఏపీకి పంపగా.. అది ఇష్టం లేని ఆయన స్వచ్ఛంద విరమణ చేశారు. ఏపీకి కేటాయించినప్పటికీ తెలంగాణలో పనిచేయడం, ఓ దశలో తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘాన్ని నిర్వీర్యం చేయడం వంటి కారణాలతో సోమేశ్‌పై ఐఏఎ్‌సలలో వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఐఏఎ్‌సల పట్ల ఆయన వైఖరి కూడా విమర్శలకు కారణమైంది.

Updated Date - Oct 11 , 2024 | 03:13 AM