Share News

రుణమాఫీ చేస్తా.. బీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తారా?

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:29 AM

రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ నేతలు విసురుతున్న సవాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూటిగా స్పందించారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటానని, మీరు

రుణమాఫీ చేస్తా.. బీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తారా?

హరీశ్‌కు సీఎం రేవంత్‌ ప్రతి సవాల్‌

బావోజీ, సేవాలాల్‌ సాక్షిగా పంద్రాగస్టులోగా రుణమాఫీ

ప్రజల్ని మోసం చేసినందుకు కేసీఆర్‌కు కోదండం వేయాలి

3900 కోట్ల లోటు బడ్జెట్‌తో సీఎంగా బాధ్యతలు చేపట్టా

4 నెలల్లో రూ.26 వేల కోట్ల అప్పుల కిస్తీలు, మిత్తి చెల్లించా

వంద రోజుల్లో అయిదు గ్యారెంటీలను అమలు చేశాం

అన్నదమ్ములుగా ఉంటున్న మతాల మధ్య బీజేపీ చిచ్చు

మోదీ చేతిలో కత్తి డీకే అరుణ.. పాలమూరు అభివృద్ధిపై కక్ష

గడీల్ని బద్ధలు కొడతానన్న ప్రవీణ్‌.. దొరల పంచన చేరారు

కొడంగల్‌, బిజినేపల్లి సభల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ నేతలు విసురుతున్న సవాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూటిగా స్పందించారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటానని, మీరు బీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేస్తారా? అని ప్రతి సవాల్‌ విసిరారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తనకు సవాల్‌ విసిరారని, అటు సూర్యుడు ఇటు పొడిచినా రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు. లంబాడ గిరిజనుల ఆరాధ్య దైవాలైన బావోజీ, సేవాలాల్‌ల సాక్షిగా ఆగస్టు 15లోగా అది జరుగుతుందని పునరుద్ఘాటించారు. తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో హరీశ్‌రావు తన మామ కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తాను రుణమాఫీ చేస్తే.. బీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేస్తారా అని హరీశ్‌కు సీఎం ప్రతి సవాల్‌ విసిరారు. మంగళవారం నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో నిర్వహించిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తాము వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలకుగాను ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, కేసీఆర్‌ పదేళ్లలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ విద్య, దళితులకు మూడెకరాల భూమి.. ఇలా ఏ హామీనీ కేసీఆర్‌ అమలు చేయలేదన్నారు. రెండుసార్లు చేసిన రుణ మాఫీ మిత్తికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లు ఏ హామీ అమలు చేయని కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో కోదండం వేయాల్సిన అవసరం ఉందన్నారు. తాగుబోతు అప్పుల సంసారంలాగా రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్‌ను తనకు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పగించారని, బాధ్యతగా వ్యవహరిస్తూ నాలుగు నెలల్లో రూ. 26 వేల కోట్ల కిస్తీలు, మిత్తి చెల్లించానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతీ నెల మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి రూ.1369 కోట్లు ఆర్టీసీకి చెల్లించామని వివరించారు. రూ.500లకు సిలిండర్‌ పథకం కింద రాష్ట్రంలో 40 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నామని, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు పథకం కింద 44 లక్షల ఇళ్లలో వెలుగులు నింపుతున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయకపోతే తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 22,500 కోట్లు కేటాయించి 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు.

రైతులపై ఒత్తిడి తెస్తే కఠిన చర్యలు!

రైతుల రుణాల వసూళ్ల కోసం డీసీసీబీ తదితర బ్యాంకులు రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఏ అధికారి ఒత్తిడి చేసినా ప్రభుత్వం సీరియ్‌సగా పరిగణిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న అసలు, మిత్తి నయా పైసలతో సహా చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రూ.500 బోన్‌సగా ఇచ్చి మరీ ప్రతీ గింజను కొంటామని హామీ ఇచ్చారు. బీజేపీ పదేళ్లలో చేసిందేమీ లేక రోడ్డెక్కి గోడల మీద పోస్టర్లు వేస్తూ, మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి కానీ, రెచ్చగొట్టే విధంగా ఉండకూడదన్నారు. హిందూయిజంలోనే పరమత సహనం ఉన్నదని, పీర్ల పండుగ హిందువులే ఎక్కువ చేసుకుంటారని, రంజాన్‌ దావత్‌లకు పోతరని, హిందువుల పండుగలకు ముస్లింలు వస్తారని, క్రిస్మ్‌సకు క్రైస్తవుల ఇండ్లకు హిందూ ముస్లింలు వెళ్లి కేకులు తింటారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అన్మదమ్ముల్లా కలిసి ఉన్న వారి మధ్య చిచ్చు పెడుతుంటే మోసపోవద్దని హితవు పలికారు. డీకే అరుణ మోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులోనే పొడిచేందుకు యత్నిస్తున్నారని.. గద్వాలలో పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి డిపాజిట్‌ తెచ్చుకోలేకపోయిన ఆమె మీద.. ముఖ్యమంత్రినైనా తనకు అసూయ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని బావోజీని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు.

ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్‌ బద్ధ శత్రువు

దొరల దురహంకారానికి కేసీఆర్‌ నిలువెత్తు నిదర్శనమని, ఎస్సీ వర్గీకరణకు ఆయన బద్ధశత్రువు అని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవికి మద్దతుగా మంగళవారం నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాను, సంపత్‌కుమార్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు.. వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని నాడు కేసీఆర్‌ చెప్పారని, కానీ పదేళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు ఆ పని చేయలేదని పశ్నించారు. నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ.. కేసీఆర్‌ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్‌కుమార్‌కు అప్పట్లో తాము అందరం బాసటగా నిలిచామన్నారు. బహుజన సమాజం కోసం దొరల గడీలను బద్దలు కొడతానని చెప్పిన ఆయన కేసీఆర్‌ గూటికి ఎందుకు చేరారని ప్రశ్నించారు. నిజంగా ఆయన లక్ష్యం నెరవేర్చుకోవాలనుకుంటే కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ వేదికగా ఉన్నప్పటికీ ఎందుకు కేసీఆర్‌ పంచన చేరారో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించి నిరుద్యోగులకు మేలు చేద్దామని నిర్ణయించామని, కానీ, ఆయన అందుకు సిద్ధపడకపోగా బీఆర్‌ఎ్‌సలో చేరడాన్ని తెలంగాణ సమాజం హర్షించడం లేదని సీఎం చెప్పారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ రోజుకు ఒక టీఎంసీకి కుదించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించి వ్యవసాయ రంగంపై నిబద్ధతను చాటుకుంటుందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే కేసీఆర్‌ మోదీకి దాసోహమయ్యారని.. ఈసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే మళ్లీ ఆ పరిస్థితి పునరావృతమవుతుందని చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల రాజే్‌షరెడ్డి, మేఘారెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 05:29 AM