Share News

Chodavaram Court Verdict: బాలికను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:51 AM

అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు చిన్నారి దివ్య (7) హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది. బీరు సీసాతో గొంతు కోసి హత్య చేసిన గుణశేఖర్‌కి ఈ శిక్ష కిరాతకులకు గుణపాఠంగా నిలవనుంది

Chodavaram Court Verdict: బాలికను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష

  • చోడవరం కోర్టు సంచలన తీర్పు

  • సోదరి కుమార్తెను బీరు సీసాతో గొంతు కోసిన ఉన్మాది

  • అక్క, బావ మందలించారనే కోపంతోనే ఘాతుకం

చోడవరం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): వరుసకు మేనకోడలైన ఏడేళ్ల చిన్నారిని కిరాతకంగా బీరు సీసాతో గొంతు కోసి చంపిన వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ అనకాపల్లి జిల్లా చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి కె.రత్నకుమార్‌ మంగళవారం సంచలన తీర్పు చెప్పారు. చోడవరం కోర్టు చరిత్రలోనే ఉరిశిక్ష విధించిన మొదటి కేసు ఇది. జిల్లాలోని దేవరాపల్లికి చెందిన వేపాడ మురుగన్‌, ధనలక్ష్మి దంపతుల కుమార్తె దివ్య(7) స్థానిక కాన్వెంట్‌లో రెండో తరగతి విద్యార్థిని. వీరి కుటుంబం స్థానికంగా చిన్న హోటల్‌ నిర్వహిస్తోంది. ధనలక్ష్మికి ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతానికి చెందిన సుబ్బాచారి గుణశేఖర్‌ వరుసకు తమ్ముడు అవుతాడు. చీమకుర్తి ప్రాంతంలో గుణశేఖర్‌ గొడవలు పడుతుండడంతో అతడి తల్లి దేవరాపల్లిలో ఉన్న ధనలక్ష్మి వద్దకు అతడిని పంపించారు. దేవరాపల్లిలోనూ గుణశేఖర్‌ సక్రమంగా ఉండకపోవడంతో అతడిని ధనలక్ష్మి, మురుగన్‌ మందలించారు. దీంతో వారిపైనే గుణశేఖర్‌ కక్షగట్టాడు. 2015 డిసెంబరు 23వ తేదీ సాయంత్రం దివ్య స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన సమయంలో ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు. దీంతో గ్రామసమీపాన రైవాడ రిజర్వాయర్‌ వెనుకనున్న బిళ్లల కొండ ప్రాంతానికి దివ్యను గుణశేఖర్‌ తీసుకెళ్లి పగిలిన బీరు సీసాతో గొంతు కోసి చంపేశాడు. ఈ తీర్పు కిరాతకులకు హెచ్చరికలా ఉందని ధనలక్ష్మి పేర్కొన్నారు.


  • చిన్నారులపై నేరాలకు మరణశిక్షలు

  • గత ఎనిమిది నెలల్లోనే 97 కేసుల్లో కఠిన శిక్షల తీర్పులు

  • పోలీసులకు డీజీపీ గుప్తా అభినందన

‘బాలికను దారుణంగా హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పాతికేళ్ల జైలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి 20 ఏళ్లు, పదేళ్లు, ఏడేళ్లు ఇలా వరుస శిక్షలు పడుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 97 కేసుల్లో బాధ్యులకు శిక్షలు పడ్డాయి’ అని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా వెల్లడించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో గుణశేఖర్‌ సుబ్బాచారికి కోర్టు మరణ శిక్ష విధించిన సందర్భంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసుల్ని డీజీపీ అభినందించారు. రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధ్యులు తప్పించుకోకుండా శిక్ష పడేలాఅన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేరం చేసిన వ్యక్తులను అరెస్టు చేయడమేగాక దర్యాప్తులోసాంకేతికతను వినియోగించి, సాక్ష్యాధారాలు సమర్థవంతంగా సేకరించి మానవ మృగాల్ని బయట లేకుండా జైళ్లకు పరిమితం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో గడిచిన ఎనిమిది నెలల్లో ఏకంగా 97 మందికి కఠిన శిక్షలు పడేలా చేశామన్నారు. విజయనగరం నుంచి అన్నమయ్య జిల్లా వరకూ ఈ శిక్షలు పడ్డాయని, మరిన్ని జిల్లాల్లోనూ ఈ ఒరవడి మొదలైందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:52 AM