Share News

Hyderabad: ఆ నామినేటెడ్‌ పదవులకు గ్రీన్‌సిగ్నల్‌!

ABN , Publish Date - Jun 30 , 2024 | 02:52 AM

రాష్ట్రంలో 37 నామినేటెడ్‌ పదవులకు నియామకాలు చేపడుతూ రేవంత్‌రెడ్డి సర్కారు గతంలో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నియామకాలపై ప్రభుత్వం జూలై మొదటి వారంలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

Hyderabad: ఆ నామినేటెడ్‌ పదవులకు గ్రీన్‌సిగ్నల్‌!

  • 37 మంది నియామకానికి అధిష్ఠానం ఓకే

  • జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 37 నామినేటెడ్‌ పదవులకు నియామకాలు చేపడుతూ రేవంత్‌రెడ్డి సర్కారు గతంలో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నియామకాలపై ప్రభుత్వం జూలై మొదటి వారంలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధిష్ఠానం అనుమతితో వారి నియామకాలకు అంతా సిద్ధం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో కోడ్‌ అమల్లోకి వచ్చి.. ఆ నియామకాలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ఆగిపోయింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇద్దరు నేతల నియామకాల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతోపాటు ఒకరిద్దరు నేతలు తమకు కేటాయించిన పదవుల పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినా.. ఉత్తర్వుల జారీ పెండింగ్‌లో ఉండిపోయింది.


కాగా, శుక్రవారం అధిష్ఠానం పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీల భేటీ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్‌ పదవుల నియామకంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తే.. అది మరింత వివాదాస్పదమయ్యే అవకాశం ఉంటుందని, ఎన్నికల ముందు నిర్ణయించిన మేరకే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో ఈ అంశాన్ని త్వరితగతిన తేల్చేసి వెనువెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధిష్ఠానం పెద్దలు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు దీపాదాస్‌ మున్షీ ఆయా నేతలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోనున్నారు. దాదాపుగా గతంలో నిర్ణయించిన మేరకే నియామక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, కుదరని పక్షంలో స్వల్ప మార్పులు చేపట్టి.. నియామక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jun 30 , 2024 | 02:52 AM