Share News

Cooking Oils: వంటనూనెలు భగ్గు!

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:13 AM

వినియోగదారులూ పారాహుషార్‌.. త్వరలోనే వంట నూనెల ధరలు భగ్గుమనబోతున్నాయి.

Cooking Oils: వంటనూనెలు భగ్గు!

  • ముడి, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్‌, సోయాబీన్‌ ఆయిల్‌పై దిగుమతి సుంకం భారీగా పెంపు

  • నూనెల ధరలు పెరిగే అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: వినియోగదారులూ పారాహుషార్‌.. త్వరలోనే వంట నూనెల ధరలు భగ్గుమనబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ముడి, శుద్ధిచేసిన పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌ నూనెపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచడమే ఇందుకు కారణం. ముడి సన్‌ఫ్లవర్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని 20 శాతానికి, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని 32.5 శాతానికి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముడి పామాయిల్‌, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ సీడ్‌ ఆయిల్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం సున్నా నుంచి 20 శాతానికి పెరిగింది. అలాగే శుద్ధి చేసిన పామాయిల్‌, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం 12.5 నుంచి 32.5 శాతానికి ఎగబాకింది.


ఈమేరకు మొత్తం సుంకం ముడి నూనెలపై 5.5 శాతం నుంచి 27.5 శాతానికి, రిఫైన్డ్‌ ఆయిల్స్‌పై 13.75 శాతం నుంచి 35.75 శాతానికి పెరగనుంది. శనివారం నుంచి సుంకాల్లో మార్పు అమల్లోకి రానుంది. దిగుమతి సుంకం పెరగడం వల్ల దేశీయంగా వంట నూనెల ధరలు పెరగనున్నాయి. ధరల పెరుగుదల వినియోగాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సుంకాల పెంపు నేపథ్యంలో విదేశాల నుంచి పామ్‌ ఆయిల్‌, సోయా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. భారత్‌ తన వెజిటేబుల్‌ ఆయిల్స్‌ డిమాండ్‌ను 70 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ఇండోనేషియా, మలేసియా, థాయిలాండ్‌ నుంచి పామ్‌ ఆయిల్‌ను మన దేశం కొనుగోలు చేస్తోంది. సోయా ఆయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్‌, రష్యా, ఉక్రెయిన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.

Updated Date - Sep 14 , 2024 | 03:13 AM