బెయిల్ వస్తది.. ధైర్యంగా ఉండు!
ABN , Publish Date - Apr 15 , 2024 | 03:33 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు కేటీఆర్ కలిశారు. కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు, వ్యక్తిగత సహాయకుడు శరత్‌తో కలిసి ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి

కవితకు భరోసా ఇచ్చిన కేటీఆర్.. సీబీఐ కస్టడీలో వసతులు, విచారణపై ఆరా
35 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చ
కేటీఆర్ వెంట బావ అనిల్, న్యాయవాది మోహిత్
ముగిసిన సీబీఐ కస్టడీ.. నేడు మళ్లీ కోర్టుకు కవిత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు కేటీఆర్ కలిశారు. కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు, వ్యక్తిగత సహాయకుడు శరత్‌తో కలిసి ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్.. కవితతో ములాఖత్ అయ్యారు. ఆదివారం సాయం త్రం 5:45 గంటలకు సీబీఐ కార్యాలయంలోకి వెళ్లి న కేటీఆర్.. 7:40 గంటలకు బయటకు వచ్చారు. అయితే, కవితతో 35 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగినట్లు తెలిసింది. సీబీఐ కస్టడీలో వసతు లు, విచారణ తీరు, ఏయే అంశాలపై విచారణ నడుస్తున్నది, తిహాడ్ జైలులో పరిస్థితి, సీబీఐ అరెస్టు సమాచారం ఎప్పుడు తెలిసింది? కేసు విచారణలో ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు, బెయిల్ పిటిషన్ తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. బెయిల్ వస్తుందని, ధైర్యంగా ఉండాలని కవితకు కేటీఆర్ ధైర్యం చెప్పినట్టు తెలిసింది. వాస్తవానికి శనివారమే కేటీఆర్ ఢిల్లీకి వచ్చి, తిహాడ్ జైలులో కవితను కలవాల్సి ఉంది. అయితే, కవితను సీబీఐ అరెస్టు చేయడం, కస్టడీలోకి తీసుకోవడంతో కేటీఆర్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది. ఒకరోజు ఆలస్యంగా ఆదివారం ఆయన కవితను కలిశారు.
నేడు కోర్టు ముందుకు కవిత
కవిత సీబీఐ కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు అంశాలను సీబీఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. విచారణకు కవిత సహకరించలేదని సీబీఐ భావిస్తే.. మరో 3-5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. గతంలో ఈడీ కూడా కవితను రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరోసారి కస్టడీకి తీసుకుంటుందా? లేదా అనేది ఉత్కంఠగా మారింది. సీబీఐ కస్టడీకి కోర్టు అంగీకరిస్తే కవితను మళ్లీ సీబీఐ హెడ్ ఆఫీసుకు తరలించనున్నారు.
శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు?
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గత రెండేళ్లుగా అనేక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు సేకరించిన తర్వాత కవితతోపాటు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈడీ విచారణతో పోలిస్తే సీబీఐ మరికొన్ని అదనపు సాక్ష్యాలను ేసకరించింది. కవిత కస్టడీ రిపోర్టులో అనేక విషయాలను బహిర్గతం చేసింది. కేసులో అసలు సూత్రధారి, పాత్రధారి కవితేనని ఆరోపించింది. మద్యం వ్యాపారిని కేజ్రీవాల్‌కు పరిచయం చేసిందే కవితేనని తెలిపింది. ఆదివారం నాటి విచారణలోనూ శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా అడిగినట్టు సమాచారం. శరత్ చంద్రారెడ్డి ఎలా పరిచయం? ఎన్నిసార్లు కలిశారు? అని ప్రశ్నించినట్టు తెలిసింది. మహబూబ్ నగర్‌లో రూ.14 కోట్ల భూమిని బలవంతంగా అమ్మిన విషయంలో శరత్‌చంద్రారెడ్డి వాంగ్మూలంతోపాటు ఇతర సాక్ష్యాలను కవిత ముందు పెట్టి పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.