KCR : కవితను తప్పించేందుకే..
ABN , Publish Date - May 28 , 2024 | 06:16 AM
తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ అరెస్టుకు నాటి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారా? బీజేపీ అధిష్ఠానంతో నేరుగా బేరసారాలు ఆడేందుకే ఆ
బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశం
లిక్కర్ స్కామ్‌లో కేంద్రంతో బేరసారాలకే!
కేరళలో ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు
ప్రత్యేక విమానంలో వెళ్లిన రాష్ట్ర పోలీసులు
ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ విఫలం
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు విఫలం
కావడంతో పోలీసులపై మండిపడ్డ కేసీఆర్
బీజేపీ సంప్రదించింది ఒక్క రోహిత్ రెడ్డినే
కేసీఆర్ ఆదేశంతో తెరపైకి రేగా కాంతారావు,
గువ్వల బాలరాజు, బీరం హర్షవర్దన్ రెడ్డి
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోన్ ట్యాప్
పట్నం మహేందర్ రెడ్డి, భార్య సునీతపై నిఘా
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు
కడియం, శంబీపూర్ రాజు ఫోన్లూ ట్యాప్
నేరాంగీకార వాంగ్మూలంలో రాధాకిషన్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మే 27(ఆంధ్రజ్యోతి): తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ అరెస్టుకు నాటి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారా? బీజేపీ అధిష్ఠానంతో నేరుగా బేరసారాలు ఆడేందుకే ఆ ప్రణాళిక రచించారా? అంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ఇచ్చారు. కేసీఆర్ వేసిన ప్లాన్.. పోలీసుల వైఫల్యంతో ఫెయిలయిందని చెప్పారు. అదొక్కటే కాదు.. తన నేరాంగీకార వాంగ్మూలం (కన్ఫెషన్ స్టేట్‌మెంట్)లో ఆయన పలు సంచలన విషయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. తవ్వేకొద్దీ ఎన్నెన్నో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసులను పావుగా వాడుకుని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అమలుచేసిన అనేక ఎత్తులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పలు కొత్త విషయాలను రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. దాని ప్రకారం.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్‌ఎ్‌సకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని ఇప్పటివరకూ చాలామంది అనుకుంటున్నారు. కానీ.. వాస్తవానికి బీజేపీ పైలెట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపింది. అయితే, ఈ విషయం కేసీఆర్‌కు తెలియడంతో.. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇందులో భాగం చేయాలని ఆదేశించినట్టు రాధాకిషన్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి కేంద్రంతో బేరసారాలు ఆడాలన్నది కేసీఆర్ ప్లాన్ అని ఆయన వివరించారు. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తి.. కేరళలోని మాతా అమృతానందమయి ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న వ్యకిని అరెస్టు చేసేందుకుసైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు కేరళకు వెళ్లగా.. అయన తప్పించుకున్నారు.
దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లుతోపాటు, ఇతర అధికారులను చార్టర్డ్ విమానంలో కేరళకు పంపారు. అయినా ప్లాన్ వర్కవుట్ కాలేదు. అంతలోనే.. న్యాయస్థానం ఈ కేసును సిట్ నుంచి బదిలీ చేసి సీబీఐకి అప్పగించింది. ఈ సమయంలో అనుకున్న విధంగా పని జరగకపోవడంతో పెద్దాయన (కేసీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని రాధాకిషన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ‘‘దేశాన్ని కుదిపేసిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మేము కీలకంగా ఉన్నాము. మొయినాబాద్ ఫామ్‌హౌ్‌సలో 2022 అక్టోబర్ చివరి వారంలో ఈ సంఘటన జరిగింది. ఈ సమయంలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి ఊపుమీద ఉన్న బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీఆర్ ఆ సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇదే సమయంలో.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో బీజేపీకి చెందిన కొందరు టచ్‌లోకి వెళ్లారని, పార్టీ మారేందుకు ఆయన్ను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ నుంచి సమాచారం వచ్చిందని ప్రభాకర్ రావు నాతో చెప్పారు. బీజేపీని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేని కేసీఆర్.. ఎమ్మెల్యేతోపాటు బీజేపీ నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేయాలని సూచించారు. ఈ పనిని ప్రణీత్ రావుకు అప్పగించారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడంతోపాటు కొన్ని ఆడియో క్లిప్‌లను సేకరించి పంపాడతడు. అవే ఆడియో క్లిప్‌లను సీఎం కేసీఆర్‌కు ఇచ్చాము. తమకు అనుకూలంగా పనిచేయాలంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సూచించిన సీఎం కేసీఆర్, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగించాలని పథకం వేశారు. ఇందులో భాగంగానే వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తెరపైకి తెచ్చారు. కేసీఆర్ ఆదేశాలతోనే పైలెట్ రోహిత్ రెడ్డి మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేతల తరఫున వచ్చిన నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరి వ్యవహారం రికార్డ్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌ను ఢిల్లీ పంపి కెమెరాలను తెప్పించి, సమావేశానికి ఒకరోజు ముందు ఫామ్‌హౌ్‌సలో బిగించారు’’ అని రాధాకిషన్ రావు వివరించారు.
మొత్తం వ్యవహారం నేనే నడిపించా..
పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును గత ప్రభుత్వ పెద్దలు కావాలనే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా (ఓఎ్‌సడీ) నియమించినట్టు రాధాకిషన్‌రావు వెల్లడించారు. ‘‘ఆయన ఇంటెలిజెన్స్‌కు వచ్చిన తర్వాతే.. నాతో సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌కు తీసుకొచ్చారు. నాది కూడా అదే సామాజిక వర్గం కావడంతో అప్పటి ప్రభుత్వం నాకు మూడేళ్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ (ఓఎ్‌సడీ)గా అవకాశం ఇచ్చింది’’ అని తెలిపారు. ముఖ్యంగా భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు, వేణుగోపాల్ రావు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసుకొని లీడ్ చేశారని చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌పరంగా తాను మొత్తం వ్యవహారం దగ్గరుండి నడిపించానని రాధాకిషన్ రావు తెలిపారు.
బీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించాలని..
2023లో బీఆర్‌ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు అహర్నిశలూ కృషి చేసినట్టు రాధాకిషన్‌రావు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో ప్రత్యర్థి పార్టీల నాయకులకు ఆర్థికంగా అండగా నిలిచిన వ్యాపారులను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేవాళ్లమని.. వారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని, దాన్ని అడ్డుకొని సీజ్ చేసేవాళ్లమని వివరించారు. అలాగే.. బీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకునేవారు, పార్టీ మనుగడకు ఇబ్బందికరంగా మారిన కొంతమంది ప్రముఖులతో పాటు, పార్టీలోనే ఉన్నా అసంతృప్తితో రగిలిపోతున్న అనుమానితుల ఫోన్‌లూ ట్యాప్ చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పెద్దాయనకు చేరవేశామని రాధాకిషన్‌రావు పోలీసులకు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపైన, కడియం శ్రీహరితో విభేదాలున్న రాజయ్యపైనా.. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా.. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్‌లపై నిఘాపెట్టి ట్యాప్ చేశామని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని.. వారితో పాటు, ఎన్టీవీ చైర్మన్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్‌రావు వాంగ్మూలమిచ్చారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావుతో డైరెక్ట్‌గా టచ్‌లోకి వెళ్లి.. ఐన్యూస్ ఎండీశ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ రావు అందించిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునిల్ కనుగోలునూ ప్రణీత్‌రావు టార్గెట్ చేసి, కేసులు నమోదుచేశారని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు.
సిగ్నల్ యాప్, శ్నాప్‌చాట్ ద్వారా..
ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీలో ఉన్న ప్రత్యేక ముఠాలు సేకరించిన సమాచారాన్ని వాట్సాప్, శ్నాప్‌చాట్ అప్లికేషన్స్ ద్వారా షేర్ చేసుకునే వాళ్లమని రాధాకిషన్‌రావు వెల్లడించారు. ఏవైనా విషయాలు తెలుసుకోవాలన్నా, సందేహాల గురించి మాట్లాడుకోవాలన్నా సిగ్నల్ యాప్ వినియోగించినట్లు తెలిపారు. భుజంగరావు, ప్రణీత్‌రావు, తిరుపతన్న, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావులతో సిగ్నల్ యాప్‌తోనే మాట్లాడేవారని వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చట్టవిరుద్ధం అని తెలిసే.. వాంగ్మూలంలో ప్రణీత్‌రావు వెల్లడి
టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధం అని తెలిసే తాము ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డామని.. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తాము చేస్తున్నది చట్టవిరుద్ధం అని తెలుసు కాబట్టి ఈ విషయంలో అత్యంత గోప్యత పాటించేవారమని.. వాట్సా్‌పలో వీవోఐపీ (వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రొటోకాల్) ద్వారా మాట్లాడుకునేవారమని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీనే మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నామని.. కానీ, ఆ పార్టీ ఓడిపోవడంతో చట్టపరంగా ఎదురయ్యే పర్యవసానాలను ఊహించి ప్రభాకర్ రావు తమను అప్రమత్తం చేశారని.. దీంతో తామందరం ఒకరినొకరు సంప్రదించుకుని, అన్ని ఎలకా్ట్రనిక్ ఆధారాలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నామని ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈమేరకు.. ఎస్‌ఐబీ టెక్నికల్ సిబ్బంది సాయంతో అన్ని సర్వర్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్లోని డేటా ధ్వంసం చేశామని తెలిపారు.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీపై నిఘా..
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబరు, నవంబరు నెలల్లో పెద్దాయన (కేసీఆర్) ఆదేశాల మేరకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ కదలికలపై నిఘా పెట్టినట్టు రాధాకిషన్ రావు పేర్కొన్నారు. విచారణ అధికారులకు వెల్లడించిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘రాధాకృష్ణను కలుస్తున్న రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులపై ప్రధానంగా దృష్టి సారించాం. ఆయన ఫోన్ ట్యాప్ చేసి సేకరించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు చేరవేసేవాళ్లం’’ అని తెలిపారు.
ఒకేసారి రాజీనామా..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు 2023 డిసెంబర్ 4న ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు రాజీనామా చేశారని.. తాను కూడా ఆయనతో పాటు అదే రోజు రాజీనామా చేశానని రాధాకిషన్ రావు తెలిపారు. ‘‘ప్రభుత్వ సిమ్‌కార్డును, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఐప్యాడ్‌ను తిరిగి ఇచ్చేశాను. నా సొంత మొబైల్ ఫోన్‌ను ఫార్మాట్ (డేటా చెరిపివేత) చేశాను. ప్రభాకర్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, ఇతర అధికారులతో చేసిన చాటింగ్‌లు, సంభాషణలు డిలీట్ చేయించాను’’ అని వివరించారు. పెద్దాయన (కేసీఆర్) రెండు సార్లు సిటీ టాస్క్‌ఫోర్స్‌లో రీ అపాయింట్‌మెంట్ ఇచ్చినందున తాను ఆయనకు రుణపడి ఉన్నానని.. కాబట్టి, ఈ కేసులో ఇంతకుమించి వివరాలు చెప్పలేనని తన వాంగ్మూలంలో రాధాకిషన్‌రావు పేర్కొనడం గమనార్హం.