Analysis: ఉత్తరం ఒకలా.. దక్షిణం మరోలా
ABN , Publish Date - May 14 , 2024 | 03:52 AM
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ ఓటింగ్‌లో తేడా.. భారీగా క్రాస్ ఓటింగ్
గత ఎంపీ ఎన్నికల తరహాలోనే విభిన్న పోలింగ్
అభ్యర్థుల కంటే.. పార్టీ ఆధారంగానే పడిన ఓట్లు
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ముఖ్యంగా ఐదున్నర నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం.. ఈ ఎన్నికల్లో పూర్తిగా రివర్స్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల ఓట్లు భారీగా క్రాస్ అయినట్లు సమాచారం. మెజారిటీ స్థానాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీనే ప్రధాన ప్రత్యర్థులుగా కనిపించాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ లాంటి చోట్ల ఓటరు నాడి విభిన్నంగా కనిపించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో అయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతానికి.. సోమవారం పడ్డ ఓట్ల శాతానికి తేడా స్పష్టంగా కనిపించింది. ఈ నియోజకవర్గాల్లో కొందరు సిటింగ్ ఎంపీలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కేవలం వారి పార్టీ, కేంద్రంలో ఎవరు ఉండాలన్న దాని ఆధారంగానే ఓటింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూల ఓటింగ్ పడిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ మినహా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి అన్ని చోట్ల అధికార కాంగ్రె్‌సతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చింది. మెదక్‌లో బీఆర్‌ఎ్‌సదే పైచేయి అవుతుందని, ఒక్క సిద్దిపేటలో వచ్చే మెజారిటీతోనే తాము బయటపడగలమని గులాబీ దళం భావిస్తోంది.
కానీ అక్కడ కూడా బీజేపీకే సానుకూల ప్రచారం (మౌత్ పబ్లిసిటీ) ఎక్కువగా జరిగిందని చెబుతున్నారు. ఇక కరీంనగర్ పరిధిలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే సామాజికవర్గ అభ్యర్థులను రంగంలోకి దించినప్పటికీ.. వెలమ సామాజికవర్గంలో మెజారిటీ ఓట్లు కాంగ్రె్‌సవైపు వెళ్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, భువనగిరి, మహబూబ్‌నగర్ స్థానాల్లో అధికార పార్టీకి సానుకూలంగా ఓటింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, ఒకటి రెండు చోట్ల అధికార కాంగ్రెస్ ఓట్లు బీఆర్‌ఎస్ అభ్యర్థులకు పోలైనట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఖమ్మం పరిఽధిలో తమ సామాజిక వర్గానికి అధికార పార్టీ టికెట్టు కేటాయించలేదన్న ఆగ్రహంతో... వారు బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేశారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో.. తమ అభ్యర్థి ఎలాగూ గెలవడన్న అభిప్రాయంలో ఉన్న ఆ పార్టీ కేడర్, ఓటర్లు... బీజేపీవైపు మొగ్గు చూపారు. ఫలితంగా.. 2019తో పోలిస్తే కమలనాథులకు గణనీయంగా సీట్లు పెరగొచ్చని ఓ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
ఓటింగ్ శాతంలో తేడా...
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 73.74ు ఓటింగ్ జరిగింది. నాటి అధికార బీఆర్‌ఎ్‌సకు 46శాతం ఓట్లు రాగా.. కాంగ్రె్‌సకు 28.40, బీజేపీకి 6.98 శాతమే వచ్చాయి. ఆరు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 41శాతం ఓట్లే వచ్చాయి. బీజేపీ అనుహ్యంగా 19.65శాతం ఓట్లు రాబట్టుకొని, నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ సైతం 29.79శాతం ఓట్లు తెచ్చుకొని మూడుసీట్లు గెలుచుకుంది. ఇక.. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 శాతం పోలింగ్ నమోదు కాగా.. కాంగ్రెస్‌కు 39.40ు, బీఆర్‌ఎ్‌సకు 37.35ు, బీజేపీకి 13.9ు ఓట్లు వచ్చాయి. కానీ, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటింగ్ శాతం తగ్గి.. బీజేపీకి బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. కాంగ్రె్‌సకు 8-10, బీజేపీకి 6-8 సీట్లు, మజ్లిస్‌కు ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ ఒక్క సీటూ గెలవకపోవచ్చని, అదృష్టం మెదక్‌లో గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.