Weather Update: చల్లని కబురు
ABN , Publish Date - May 15 , 2024 | 03:23 AM
దేశ ప్రజలకు చల్లని కబురు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయి. భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) అంచనాల
ఈ నెల 19కల్లా అండమాన్‌ను తాకనున్న రుతుపవనాలు: ఐఎండీ
నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు
జైనాలో అత్యధికంగా 42.9 డిగ్రీలు
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి) : దేశ ప్రజలకు చల్లని కబురు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయి. భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఏటా మే 22న దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తుంటాయి. కానీ ఈసారి మూడు రోజులు ముందుగానే వస్తున్నాయి. రుతుపవనాలు గతేడాది కూడా మే 19 నాటికి అండమాన్ చేరుకున్నప్పటికీ ఆ తర్వాత వాటి కదలికలు మందగించాయి. ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక, బుధ, గురువారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, జగిత్యాల జిల్లా జైనాలో మంగళవారం 42.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.