Share News

Srisailam Project: శ్రీశైలానికి మరింత వరద..

ABN , Publish Date - Aug 10 , 2024 | 03:59 AM

కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం డ్యాం సైట్‌ వద్ద 3,92,415 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. జూరాల, సుంకేశుల నుంచే 3,29,576 క్యూసెక్కుల వరద చేరుతోంది.

Srisailam Project: శ్రీశైలానికి మరింత వరద..

  • 3.92 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • 4.13 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

  • సాగర్‌ గేట్లన్నీ రెండో రోజూ ఓపెన్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం డ్యాం సైట్‌ వద్ద 3,92,415 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. జూరాల, సుంకేశుల నుంచే 3,29,576 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో పది గేట్లు ఎత్తి 3,50,110 క్యూసెక్కులను, తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం 33,549 క్యూసెక్కులు, ఏపీ విద్యుదుత్పత్తి కోసం మరో 30,007 క్యూసెక్కులు.. మొత్తం 4.13 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.


గేట్ల నుంచి 2,57,918 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. కుడి, ఎడమ కాల్వలు, జలవిద్యుదుత్పత్తికి అంతా కలసి మొత్తంగా 3,06,090 క్యూసెక్కులు విడుస్తున్నారు. బేసిన్‌లో ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్‌లకు వరద తగ్గింది. ఆల్మటికి 2,06,500 క్యూసెక్కులు వస్తుండగా.. నారాయణపూర్‌కు 1,50,000 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి 1,29,750 క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి భీమా నది నుంచి 1,22,000 క్యూసెక్కులతో మొత్తం 2,96,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.


  • జలవిద్యుదుత్పత్తితో రోజుకు రూ.14 కోట్లు

కృష్ణా ప్రాజెక్టులకు నిలకడగా చేరుతున్న వరద కాసులు కురిపిస్తోంది. బేసిన్‌ పరిధిలో ఉన్న జూరాల నుంచి పులిచింతల దాకా ప్రాజెక్టుల్లో ప్రతీరోజూ 3.7 కోట్ల యూనిట్ల కరెంట్‌ ఉత్పత్తవుతోంది. ఈ లెక్కన యూనిట్‌కు రూ.4 వేసుకున్నా రోజుకు రూ.14 కోట్ల లాభాన్ని జెన్‌కో గడిస్తోంది. అయితే నిర్లక్ష్యంతో పలు విద్యుత్తు కేంద్రాలను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసుకోకపోవడంతో రోజుకు రూ.3 కోట్ల నష్టం వస్తోంది. ఇక ఈ సీజన్‌లో 522.76 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి అయింది.

Updated Date - Aug 10 , 2024 | 03:59 AM