Krishna Basin: ఆల్మట్టి నుంచి సాగర్ దాకా!
ABN , Publish Date - Aug 06 , 2024 | 03:18 AM
కొద్దిరోజులుగా భారీగా వస్తున్న వరదతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండాయి. ఇంకా నిలకడగా వరద వచ్చిచేరుతుండటంతో ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా ప్రాజెక్టుల గేట్లన్నీ తెరిచి ఉంచారు.
అన్ని ప్రాజెక్టుల గేట్లనూ తెరిచి దిగువకు నీరు
నాగార్జునసాగర్‌లో 20 గేట్ల నుంచి విడుదల.. ఎగువ నుంచి 3.75 లక్షల క్యూసెక్కులు
దిగువకు 1,96,027 క్యూసెక్కులు.. 584.80 అడుగుల వద్ద సాగర్ నీటిమట్టం
పులిచింతలలోనూ రెండు గేట్లు ఓపెన్.. ఎగువ ప్రాజెక్టులకు స్వల్పంగా తగ్గుతున్న వరద
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కొద్దిరోజులుగా భారీగా వస్తున్న వరదతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండాయి. ఇంకా నిలకడగా వరద వచ్చిచేరుతుండటంతో ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా ప్రాజెక్టుల గేట్లన్నీ తెరిచి ఉంచారు. ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఇప్పటికే తెరుచుకొని ఉండగా.. నారాయణపూర్ ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లు, ఉజ్జయిని ప్రాజెక్టు గేట్లు16, జూరాల ప్రాజెక్టుకు గేట్లు 34 , శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, నాగార్జునసాగర్‌కు చెందిన 20 గేట్లను తె రిచి ఉంచారు. సాగర్‌లో ఉదయం 10గంటలకు ప్రాజెక్టు సీఈ నాగేశ్వర్‌రావు ప్రధాన డ్యాం క్రస్ట్ గేట్లపై 13వ నంబరు గేటు వద్ద ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం స్విచ్‌ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత మొత్తం 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
మధ్యాహ్నం నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గేట్లపై స్విచ్ఛాన్ చేసి మరో 4 గేట్లను ఎత్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 10 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 73,630 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువనుంచి వరద రాక స్థిరంగా కొనసాగుతుండటంతో సాయంత్రం 5 గంటలకు మరో 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు మరో రెండు గేట్లు, రాత్రి 10 గంటలకు మరో 4 గేట్లు ఎత్తారు. దీంతో మొత్తం 20 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,50,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, సోమవారం రాత్రి 10 గంటలకు 584.80 అడుగులుగా ఉంది.
కుడికాల్వ ద్వారా 8,221 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 6.325 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 600 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,501 క్యూసెక్కులు, 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,50,590 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నుంచి మొత్తం 1,96,027 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. కాగా, ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు రెండు గేట్లనుంచి 32,390 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు(45.77 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 131.88 అడుగులుగా (7.10 టీఎంసీలు) నమోదైంది. ప్రాజెక్టుకు 67,112 క్యూసెక్కుల వరద వస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తగ్గుతున్నది. సోమవారం డ్యాం సైట్ వద్ద 3,44,218 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా సోర్స్ ప్రాజెక్టులైన జూరాల, సుంకేశుల నుంచి 3,69,067 క్యూసెక్కుల వరద విడుదలవుతోంది. వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయం గేట్ల ఎత్తును కూడా తగ్గించారు. పది గేట్లు 12 ఫీట్ల మేరకు ఎత్తి 3,10,840 క్యూసెక్కులను, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,857 క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 26,481 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
జలాశయాల్లో నీటి నిల్వల పెంపు..
ఎగువన ఉన్న జలాశయాలకు వరద తగ్గుముఖం పడుతుండటంతో ఖాళీ చేసిన జలాశయాల్లో క్రమంగా నిల్వలను పెంచుకుంటున్నారు. ఈ నెల 3న ఆల్మట్టిలో 72.89 టీఎంసీలుండగా... సోమవారం 83.91 టీఎంసీలకు చేర్చారు. నారాయణపూర్‌లో 28.88 టీఎంసీలుండగా.. 31.93 టీఎంసీలకు చేర్చారు. తుంగభద్రలో 98.26 టీఎంసీలుండగా.. 100.52 టీఎంసీలకు పెంచుకున్నారు. కృష్ణా క్యాచ్‌మెంట్ ఏరియాలో కృష్ణా ఉపనది ఘటప్రభకు భారీగా వరద వస్తుండగా, పంచగంగా నుంచీ భారీగానే వరద వచ్చిచేరుతోంది. మహారాష్ట్ర భీమానదిపై ఉజ్జయిని ప్రాజెక్టుకు 2.05 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.27 లక్షల క్యూసెక్కులను కిందకు వదిలారు. పుణె, కొల్హాపూర్‌లో వర్షాలతో ఈ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది.
శ్రీరాంసాగర్‌కు జలకళ
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి 16వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు ( 80.5టీఎంసీ )లు కాగా.. సోమవారం సాయంత్రానికి 1080 అడుగుల (45 టీఎంసీల ) మేర నీటి నిల్వ ఉంది. మొత్తమ్మీద వరుస వర్షాలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టులోకి 7,822 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. నంది, గాయత్రి పంప్ హౌస్‌ల నుంచి మూడు మోటార్ల ద్వారా 9,450 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరులోకి ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.091 టీఎంసీలు ఉన్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గిపోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు సోమవారం సాయంత్రం నుంచి ఒక మోటార్ నిలిపి వేసి 3 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు.
అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలు ప్రారంభం
సిరిసిల్ల జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతలు సోమవారం ప్రారంభయయ్యాయి. 3.5 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.76 టీఎంసీలే ఉన్నాయి. యాసంగి సీజన్‌లో అన్నపూర్ణలో నీరు లేకపోవడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల విస్తీర్ణంలో పంటలు ఎండిపోయాయి. దీంతో రైతుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుత ప్రభుత్వం స్పందించి మధ్య మానేరులో 10.03 టీఎంసీల నీరు ఉండడంతో ఎత్తిపోతలను ప్రారంభించింది. రెండు మోటార్ల ద్వారా 6,400 క్యూసెక్కుల నీటిని ప్రతీ రోజు అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రస్తుత ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో
సామర్థ్యం సామర్థ్యం
ఆల్మట్టి 129.72 83.91 291028 210000
నారాయణపూర్ 37.64 31.93 210000 189700
తుంగభద్ర 100.86 100.52 82772 149202
జూరాల 9.66 8.45 290000 50152
శ్రీశైలం 215.81 204.79 344218 375178
నాగార్జునసాగర్ 312.05 294.55 374713 196027
సింగూరు 29.91 14.71 391 391
శ్రీరాంసాగర్ 80.5 45.16 16229 743
కడెం 7.6 6.67 1433 957
ఎల్లంపల్లి 20.18 14.11 8917 13047
మేడిగడ్డ 16.17 6.07 373500 373500
సమ్మక్క 6.94 6.94 558200 558200
సీతమ్మ 36.57 0.2 604823 604823