Share News

KCR: మూర్ఖ ముఖ్యమంత్రి..

ABN , Publish Date - May 11 , 2024 | 06:24 AM

‘‘తెలంగాణ రాష్ట్రం.. మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాంగ్రెస్‌ అలవికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి గద్దెనెక్కింది. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్తగా అలోచించి ఓటేయాలి.

KCR: మూర్ఖ ముఖ్యమంత్రి..

గ్యారెంటీల పేరిట రేవంత్‌ మోసం

కాంగ్రెస్‌ అలవికాని హామీలిచ్చి నెరవేర్చలేదు

బీజేపీ పేదలపార్టీ కాదు.. పెట్టుబడిదారుల పార్టీ

జిల్లాలను రద్దు చేస్తే ఊర్కుందామా?: కేసీఆర్‌

సిరిసిల్ల/సిద్దిపేట, మే 10 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రాష్ట్రం.. మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాంగ్రెస్‌ అలవికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి గద్దెనెక్కింది. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్తగా అలోచించి ఓటేయాలి. ఆగమాగం కావొద్దు’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం రాత్రి రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో కేసీఆర్‌ బస్సు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్‌ షోలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్నర్‌ మీటింగుల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. రైతు బంధు రాలేదని, నీళ్లు లేవని, కరెంట్‌ కోతలున్నాయని, మరమగ్గాలు మూతపడ్డాయని, ధాన్యం కొనడం లేదని, కల్లాల్లో తడిసిపోతున్నా అడిగే వారు, కోనేవారు దిక్కులేకుండాపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న ఒకే ఒక్క గ్యారెంటీ మహిళలకు ఉచిత బస్సు అని, అది కూడా సర్కస్‌ స్కీం అంటూ దుయ్యబట్టారు.

పదేళ్ల పాటు కేంద్రంలో అధికారం చెలాయించిన బీజేపీ పేదల పార్టీ కాదని, పెట్టుబడిదారుల పార్టీ అని ఆరోపించారు. చేనేత కార్మికులు చనిపోయే పరిస్థితులు వచ్చాయని, అయినా పభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో చేనేత రంగంపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని మండిపడ్డారు. వేములవాడకు ప్రధాని మోదీ వచ్చారని, అయన పక్కనే బండి సంజయ్‌ కూడా ఉన్నారని, ఎప్పుడూ దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడే వాళ్లు.. వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సర్కారు, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను రద్దు చేస్తుందటా.. ఊర్కుందామా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ఈ జిల్లాలను కాపాడే బాధ్యత తనదని కేసీఆర్‌ పేర్కొన్నారు.


హోటల్‌లో టీ తాగి, మిర్చీ తిన్న కేసీఆర్‌

బోయినపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలోని రాజన్న హోటల్‌లో కేసీఆర్‌ మిర్చీలు తిని, టీ తాగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోని వెంట్రావుపల్లిలో కాసేపు ఆగారు. మరోవైపు.. తన అత్తగారు ఊరైన బోయినపల్లి మండలం కొదురుపాక మీదుగా వెళ్తుండగా.. కాన్వాయ్‌ ఎదుట మిడ్‌మానేరు నిర్వాసితులు నిరసన తెలిపారు.

రాజ్యాంగబద్ధమైన సంబంధాల కోసమే నాడు కేంద్రంతో సఖ్యత

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తొలిసారి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధమైన సంబంధాలను కొనసాగించడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామని కేసీఆర్‌ తెలిపారు. శుక్రవారం ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కోరడంతో.. తాము రాష్ట్రపతి ఎన్నికలు, పెద్ద నోట్ల రద్దు తదితర అంశాల్లో కేంద్రానికి మద్దతు తెలిపామని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఒక డ్రామా అని, తన కూతురు కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అన్యాయంగా ఇందులో ఇరికించారని ఆరోపించారు. ఇండియా కూటమితో ఒరిగేదేమీ ఉండదని, పలు ప్రాంతీయ పార్టీలు కలిసి బలమైన గ్రూపుగా ఏర్పడే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు.

Updated Date - May 11 , 2024 | 06:24 AM