Share News

రేవంత్‌.. నీకు చేతకాకుంటే రాజీనామా చెయ్‌!

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:12 AM

‘చిన్న లోపాన్ని ఎత్తి చూపుతూ పదేపదే మమ్మల్ని దూషించడం కాదు.. నీకు చేతగాకుంటే రాజీనామా చెయ్‌.. నిపుణులతో చర్చించి మేడిగడ్డ సమస్యను పరిష్కరించడం చేతకాదని చెప్పి.. ఆ పదవి నుంచి దిగు.. నేను సీఎం అవుతా.. వెంటనే పరిష్కరించి చూపిస్తా..’ అంటూ సీఎం

రేవంత్‌.. నీకు చేతకాకుంటే రాజీనామా చెయ్‌!

నేను సీఎం అయి.. సమస్యను వెంటనే పరిష్కరిస్తా

ఎవరు ఎన్నేళ్లు పదవిలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారు

కాళేశ్వరంతో ప్రయోజనం 20 లక్షల ఎకరాలకు : హరీశ్‌

హైదరాబాద్‌, పిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘చిన్న లోపాన్ని ఎత్తి చూపుతూ పదేపదే మమ్మల్ని దూషించడం కాదు.. నీకు చేతగాకుంటే రాజీనామా చెయ్‌.. నిపుణులతో చర్చించి మేడిగడ్డ సమస్యను పరిష్కరించడం చేతకాదని చెప్పి.. ఆ పదవి నుంచి దిగు.. నేను సీఎం అవుతా.. వెంటనే పరిష్కరించి చూపిస్తా..’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రాజెక్టుల నిర్మాణాల్లోనూ సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు. కాళేశ్వరం పరిధిలో ఎన్నో ప్రాజెక్టులున్నా.. మేడిగడ్డలో ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే.. దాన్నే చూపించి మొత్తం ప్రాజెక్టు వృథా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావులకు మేడిగడ్డ అప్పగిస్తా.. దాన్ని బాగుచేసే బాధ్యత తీసుకుంటారా..?’ అని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ విసిరిన సవాల్‌కు స్పందనగా... రేవంత్‌ దిగిపోతే తాను సీఎం అయి పరిష్కరిస్తానని హరీశ్‌ వ్యాఖ్యానించారు. పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్‌ వ్యాఖ్యలకు... ఎవరు ఎన్నేళ్లు సీఎం పదవిలో ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని, అంతా బాగుంటే మళ్లీ ఆశీర్వదిస్తారని, ఒకవేళ పాలన బాగోలేకుంటే జనమే బండకేసి కొడతారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీళ్లు లేక పంటల సాగుకు ఇబ్బంది ఏర్పడుతుందని, బురద రాజకీయం మాని రైతులకు న్యాయం చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ ఎంత తక్కువచేసి మాట్లాడినా అది ముమ్మాటికి తెలంగాణకు వరదాయిని అని పేర్కొన్నారు. లోయర్‌ మానేరు నుంచి సూర్యాపేట దాకా చెరువులు నిండి భూమిలో ఊటలు పెరగడం, కూడవెల్లి వాగు పొంగినా.. హల్దీ వాగు దుంకినా, అన్నపూర్ణ రిజర్వాయర్‌, రంగనాయక్‌, మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లు నిండినా అది కాళేశ్వరం వల్లేనని, దాన్ని చెప్పకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచారని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని వెల్లడించారు. కాళేశ్వరం విషయంలో జలాశయాల సామర్థ్యం పెంచామని, కొత్త జలాశయాలు ప్రతిపాదించామని, జలాశయాల సామర్థ్యాన్ని పెంచినందున భూసేకరణ, పునరావాసం కోసం అదనంగా ఖర్చు పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో తట్ట మట్టి ఎత్తకుండానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంచనా విలువ రూ.17వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలనిడిమాండ్‌చేశారు.

కాళేశ్వరాన్ని బద్నాం చేసేందుకు దుష్ట పన్నాగం

మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోతే దాన్ని పరిష్కరించకుండా.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే బద్నాం చేసేలా కాంగ్రెస్‌ దుష్ట పన్నాగం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్‌ సర్కారు ఇలా చేస్తోందన్నారు. విచారణకు తాము సిద్థమని, ఈ ఘటనకు బాధ్యులెవరైనా ఉంటే శిక్షించాలని, టెక్నికల్‌ సమస్య తెలుసుకొని పునరుద్దరణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గతంలో కడెంవాగు, సింగూరు డ్యామ్‌, ఎల్లంపల్లి, సాత్నాల ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయని, పుట్టగండి ప్రాజెక్టు ప్రారంభించగానే కొట్టుకుపోయిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌ హయాంలో పోలవరం డయాఫ్రంవాల్‌, రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిందని, ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని శిక్షించి, పునరుద్థరించి, రైతులకు న్యాయం చేశారని వెల్లడించారు. మొత్తం కాళేశ్వరం పరిధిలోని ప్రాజెక్టుల ద్వారా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ప్రయోజనం అందిందని, దానిని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌ పనులు పూర్తి చేయక, నీళ్లు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక అన్నీ పూర్తిచేసి నీళ్ళు అందించామని హరీశ్‌ తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 04:12 AM