Share News

Gadwal: చోరీ నెపంతో పోలీసు స్టేషన్‌కు పిలిపించారని.. మనస్తాపంతో బాలిక ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:54 AM

ఇంట్లో పనిచేసే బాలికపై దొంగతనం నెపం మోపి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Gadwal: చోరీ నెపంతో పోలీసు స్టేషన్‌కు పిలిపించారని.. మనస్తాపంతో బాలిక ఆత్మహత్యాయత్నం

  • చావు బతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స.. గద్వాలలో ఘటన

గద్వాల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో పనిచేసే బాలికపై దొంగతనం నెపం మోపి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన బాలికను ఓ విత్తనాల వ్యాపారి కొన్ని నెలల కింద తన ఇంట్లో పనిమనిషిగా నియమించుకున్నాడు. 2 నెలల క్రితం ఇంట్లో బంగారం కనిపించడం లేదని అతడు ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బంగారం దొరికిందని చెప్పి ఆ బాలికను ఆమె అమ్మమ్మ ఇంటికి పంపించాడు. ఆ తర్వాత ఏమైందో కానీ కొద్దిరోజుల క్రితం మళ్లీ బంగారం కనిపించడం లేదంటూ మల్దకల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు బాలికను పిలిపించి విచారించగా.. చేయని దొంగతనాన్ని తనపై మోపడంపై అవమానంగా భావించి ఆ మరుసటి రోజే పురుగుల మందు తాగింది.


దీంతో కుటుంబీకులు గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే తన ఇంట్లో దొంగతనం జరిగితే గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మల్దకల్‌ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు. తమ పరిధి కాకపోయినా బాలికను మల్దకల్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి ఎందుకు విచారణ చేశారనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి కుటుంబీకులు మాట్లాడుతూ.. చావుబతుకుల మధ్య తమ కూతురు ఉంటే ఓ కానిస్టేబుల్‌ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవడానికి డబ్బులెలా వచ్చాయని ప్రశ్నించారని.. చోరీ చేసినందునే ఆస్పత్రిలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్‌ఎస్‌ నేత కురువ విజయ్‌ కుమార్‌ స్పందిస్తూ.. బాలికను పనిలోపెట్టుకోవడమే కాకుండా.. ఆమెపై నేరం మోపి వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 03:54 AM