Loan Waiver: మాఫీకి మార్గమిదీ!
ABN , Publish Date - Jul 16 , 2024 | 03:21 AM
అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ మొత్తం కలిపి కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అసలు, వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ
వ్యవధి 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9
లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ
2 లక్షలకు మించి ఉంటే.. పైమొత్తాన్ని రైతులే చెల్లించాలి
ఆ తర్వాత రుణ ఖాతాలకు రూ.2 లక్షల మాఫీ నగదు బదిలీ
యజమాని, భార్య/భర్త, పిల్లలు కలిపి కుటుంబంగా పరిగణన
కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు ప్రామాణికం
రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాఫీ
రుణమాఫీ పథకం మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
‘పీఎం-కిసాన్’ మినహాయింపులు అవసరం మేరకు పరిగణన
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ మొత్తం కలిపి కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ మొత్తాన్ని లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ చేస్తామని పేర్కొంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎ్‌స)లో అప్పు తీసుకున్న రైతుల రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 నాటికి రైతుల పేరిట ఉన్న బకాయిలను మాఫీ చేస్తామని ప్రకటించింది.
కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత (పీడీఎస్) కార్డును పరిగణనలోకి తీసుకోనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి శాఖల్లో తీసుకున్న స్వల్ఫకాలిక పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపింది. రుణమాఫీ మొత్తాన్ని ఆధారంగా చేసుకొని ఆరోహణ క్రమంలో (తక్కువ నుంచి ఎక్కువ) మాఫీ చేస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా మేరకు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై జీవో ఆర్టీ నంబరు 567ను రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం జారీ చేశారు.
జీవోలో పేర్కొన్న వివరాలు..
రుణమాఫీ పథకం-2024 పరిధి, వర్తింపు ఇలా..
తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తిస్తుంది. స్వల్ఫకాలిక పంట రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.
రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు(ఉమ్మడి బ్యాంకులు), వాటి శాఖ (బ్రాంచి)ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ పథకం వర్తిస్తుంది.
2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9వ తేదీ నాటికి మంజూరైన, రెన్యువల్ అయిన, రుణ బకాయిలకు వర్తిస్తుంది. బకాయి ఉన్న అసలు, వర్తించే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది.
రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ జారీ చేసిన ఆహార భద్రత కార్డు డేటాబే్‌సను ప్రామాణికంగా తీసుకుంటారు.
కుటుంబ యజమాని, జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు.
రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తారిలా..
రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో నేరుగా లబ్ధిదారులైన రైతు రుణ ఖాతాలకు జమ చేస్తారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉన్న రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీలకు గానీ, వాటి పరిధిలోని బ్రాంచిలకుగానీ విడుదల చేస్తారు. ఆ బ్యాంకర్లు రుణమాఫీ మొత్తాన్ని వారి పరిధిలో ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
ప్రతి రైతు కుటుంబానికి 2023 డిసెంబరు 9 నాటికి ఉన్న మొత్తం రుణం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ సొమ్మును జమ చేస్తారు. మొత్తం రుణం గానీ, లేక రూ.2 లక్షల వరకు గానీ.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది.
రూ.2 లక్షలకు మించి రుణం ఉంటే.. ఆ రైతు రూ.2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత కలిగిన 2 లక్షల మొత్తాన్ని రుణ ఖాతాకు బదిలీ చేస్తారు.
రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో.. కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు.
పథకం అమలుకు ఏర్పాట్లు, కసరత్తు, షరతులు
వ్యవసాయశాఖ కమిషనర్/డైరెక్టర్‌ను పంట రుణమాఫీ- 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్(ఎన్‌ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్‌ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తారు. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వ్యాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ పోర్టల్‌లో ఆర్థిక శాఖ నిర్వహించే ‘ఐఎ్‌ఫఎంఐఎస్’ పోర్టల్‌కు బిల్లుల సమర్పణ, పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడం, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మాడ్యూల్స్ ఉంటాయి.
ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని ‘బ్యాంకు నోడల్ అధికారి’(బీఎన్‌వో)గా నియమిస్తారు. ఈ నోడల్ అధికారి.. బ్యాంకులకు, వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్‌ఐసీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
రుణమాఫీ పొందటానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినా, మోసపూరితంగా పంట రుణాన్ని పొందినా, పథకానికి అర్హులు కాదని తేలినా.. రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనిని రికవరీ చేసే అధికారం వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు ఉంటుంది.
రైతుల సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించఢానికి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్ లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద తెలిపే అవకాశం కల్పించారు. ప్రతి అభ్యర్థనను 30 రోజుల్లోపు పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలపాలి.
రుణమాఫీ వీటికి వర్తించదు..
రుణమాఫీ పథకం.. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల)కు, జాయింట్ లయబిలిటీ గ్రూప్ (జేఎల్‌జీ)లు, రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (ఆర్‌ఎంజీ)లు, లోన్ ఎలిజిబిలిటీ కార్డ్ స్కీం (ఎల్‌ఐసీఎ్‌స)లకు తీసుకున్న రుణాలకు వర్తించదు.
పునర్‌వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు రుణమాఫీ పథకం వర్తించదు. ప్రకృతి విపత్తులు సంభవించి.. రైతులకు తీరని నష్టం కలిగినప్పుడు ఆ ప్రాంతంలో రైతులు తీసుకున్న పంట రుణాలపై ప్రభుత్వ మారిటోరియం ప్రకటిస్తే అది రీషెడ్యూలు కిందకు వస్తుంది. అప్పుడా రుణాలు స్వల్ఫకాలం నుంచి దీర్ఘకాలిక రుణాల జాబితాలోకి వెళ్తాయి.
కంపెనీలు, ఫర్మ్‌లు వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. పీఏసీఎ్‌సల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.
కేంద్రం అమలు చేసే పీఎం-కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా లభ్యత మేరకు.. ఆచరణాత్మకంగా అమలు చేయడానికి వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు.
తేట తెలుగులో మొదటి జీవో
పడికట్టు, సంక్లిష్ట పదాలు లేకుండా ఉత్తర్వు
రుణమాఫీపై వెలువరించిన వ్యవసాయ శాఖ తెలుగులో మొదటి జీవో
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) తెలుగు భాషలో వెలువడింది. పెద్దగా ఆంగ్ల పదాలు లేకుండా.. తెలుగు పడికట్టు, సంక్లిష్ట పదాలు లేకుండా ఇలా ఒక జీవో వెలువడడం ఇదే మొదటిసారి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలుగులో జీవోలను వెలువరించాలని ప్రయత్నించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ అదే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు తాజాగా పూర్తిగా తెలుగు భాషలో ఒక జీవోను జారీ చేయడం గమనార్హం. పంట రుణాల మాఫీ పథకం మార్గదర్శకాలకు సంబంధించిన జీవో (నంబర్ 567)ను మంగళవారం ఆయన పూర్తిగా తెలుగు భాషలో జారీ చేశారు. తద్వారా రేవంత్ సర్కారు తెలుగు భాషాభిమానుల మనసు చూరగొన్నది. ఇకమీదటైనా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడానికి అన్ని శాఖల కార్యదర్శులూ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కేసీఆర్ ప్రకటించినా..
జీవోలు, ఆర్డినెన్స్‌లు, చట్టాలు, నిబంధనలు, మాన్యువల్స్‌ను తెలుగులో ప్రచురించాలని గత బీఆర్‌ఎస్ సర్కారు కూడా యోచించింది. పాలనలో తెలుగుకే ప్రాధాన్యమిస్తామంటూ.. 2017 డిసెంబరులో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటిసీఎం కేసీఆర్ ప్రకటించారు. సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ, ఐబీ సిలబ్‌సలను అనుసరించే ప్రతి ప్రైవేటు పాఠశాలలో తెలుగును రెండో భాషగా బోధించాలంటూ 2022లో ఉత్తర్వులు జారీచేశారు. అప్పటి సీఎం ఓఎ్‌సడీ దేశపతి శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్‌ల బృందం. ప్రభుత్వ పరిపాలనా నియమావళిని, సచివాలయ నిబంధనావళిని సరళమైన తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేసింది. అదే కోవలో జీవోలను కూడా తెలుగులోనే ప్రచురించాలని నిర్ణయించారు. కానీ.. జీవోలను తెలుగులో అప్‌లోడ్ చేయడం మాట అటుంచి, ముఖ్యమైన జీవోలను కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు తెలుగు భాషలో ఒక జీవో రావడం విశేషమే.