Share News

Nagarajuna Sagar: ప్రాజెక్టులన్నీ నిండుగా..

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:12 AM

వరద రాక కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను శనివారం 589.70 అడుగులుగా ఉంది. 69,284 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

Nagarajuna Sagar: ప్రాజెక్టులన్నీ నిండుగా..

  • 589.70 అడుగులకు సాగర్‌ నీటి మట్టం

  • శ్రీశైలం, జూరాలకు మళ్లీ పెరిగిన వరద

  • నేడు 18 జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌

హైదరాబాద్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): వరద రాక కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను శనివారం 589.70 అడుగులుగా ఉంది. 69,284 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 40,070 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర-సుంకేసుల ప్రాజెక్టుల మధ్య భారీగా వర్షాలతో శ్రీశైలానికి 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా 884.40 అడుగులకు చేరింది. ఎగువ కృష్ణ, ఎగువ బీమా పరివాహకాలలో వర్షాలతో కృష్ణా నదికి స్వల్పంగా వరద వస్తోంది.


ఆల్మటి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు అయితే 128.19 టీఎంసీలకు చేరింది. 6,565 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. నారాయణపూర్‌కు 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. 35 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర గేటు మరమ్మతు అనంతరం నిల్వలను పెంచుతున్నారు. 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 10 వేల క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. జూరాలకు వరద గణనీయంగా పెరిగింది. 86 వేల క్యూసెక్కులు చేరుతుండగా ఔట్‌ఫ్లో 82 వేల క్యూసెక్కులుగా ఉంది.


పులిచింతలకు 30,520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. 28,631 క్యూసెక్కులను వదులుతున్నారు. కాళేశ్వరంలో ప్రధానమైన మేడిగడ్డకు 1.31 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా మొత్తం నీటిని కిందకు పంపిస్తున్నారు. ఎల్లంపల్లికి 23,094 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. కాగా, రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Updated Date - Aug 25 , 2024 | 04:12 AM