Hyderabad: చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్..
ABN , Publish Date - Jun 21 , 2024 | 04:19 AM
తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికుల కష్టాలు కొంతమేర తీరనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై తీరనున్న ప్రయాణికుల కష్టాలు
శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి గడ్కరీ
చౌటుప్పల్ టౌన్, జూన్ 20: తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికుల కష్టాలు కొంతమేర తీరనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. తహసీల్దార్ కార్యాలయం నుంచి పద్మావతి ఫంక్షన్‌హాల్ వరకు రెండు కిలోమీటర్ల పొడవున, రూ.82 కోట్లతో దీనిని చేపట్టనున్నారు. గట్టిదనం పరంగా భూమి కూడా అనుకూలంగా ఉందని తేలింది. దీంతో నిర్మాణం చకచకా జరిగే వీలుంది. కాగా, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ త్వరలో ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. నిర్మాణ సమయంలో ఇరువైపుల నుంచి వాహనాలు వెళ్లేందుకు వీలుగా.. జాతీయ రహదారుల సంస్థ అధికారులు సర్వీస్ రోడ్ల నిర్మాణం, మరమ్మతులను చేపట్టారు.
వలిగొండ అడ్డ రోడ్డు నుంచి పద్మావతి ఫంక్షన్‌హాల్ వరకు 500 మీటర్ల మేర పనులు సాగుతున్నాయి. ఇవి వారం, పది రోజుల్లో పూర్తికానున్నాయి. ఒకవైపు కాగానే, రెండోవైపు చేపడతారు. కాగా, జాతీయ రహదారి నిర్మాణ సమయంలో ఈ ప్రాంతాల్లో సర్వీ్‌స రోడ్డు నిర్మించలేదు. కాగా, ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్‌ను హరియాణాకు చెందిన రాంకుమార్ కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకుంది. 15 రోజుల్లో ఈ సంస్థ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
మంత్రి కోమటిరెడ్డి చొరవతో..
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లను నిర్మించేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచే చొరవ చూపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు. ప్రమాదకర ప్రాంతాల (బ్లాక్ స్పాట్)లను గుర్తించి ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. దీనికి సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.