Share News

Teenmar Mallanna: ఎన్నికల్లో చిచ్చు పెట్టేందుకే..

ABN , Publish Date - Nov 07 , 2024 | 06:23 PM

తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిపై త్వరలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని నిఖిల్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునంటూ సొల్లు వాగుడు వాగుతున్నాడని తీన్మార్ మల్లన్నపై మండిపడ్డారు. తనకు నేరుగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ ప్రచారం సైతం చేసుకుంటున్నాడన్నారు.

Teenmar Mallanna: ఎన్నికల్లో చిచ్చు పెట్టేందుకే..

హైదరాబాద్, నవంబర్ 07: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కేబినెట్‌లోని మంత్రులపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు గుప్పించడంపై పార్టీలోని పలువురు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తీన్మార్ మల్లన్నను తన్నీ తరమడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సిద్దంగా ఉన్నారని భువనగిరి యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిఖిల్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు


సొల్లు వాగుడు వాగుతున్నాడు..

గురువారం హైదరాబాద్‌లో నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ... తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిపై త్వరలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునంటూ సొల్లు వాగుడు వాగుతున్నాడని తీన్మార్ మల్లన్నపై మండిపడ్డారు. తనకు నేరుగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ ప్రచారం సైతం చేసుకుంటున్నాడన్నారు. తద్వారా రాహుల్ గాంధీ మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు.

Also Read: వైసీపీ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్


మల్లన్నకు వార్నింగ్..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులను ఏ మాత్రం లెక్క చేయకుండా తీన్మార్ మల్లన్న ప్రగల్బాలకు పోతున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న జాగ్రత్తగా ఉండాలంటూ నిఖిల్ రెడ్డి హెచ్చరించారు. పార్టీలోని సీనియర్లను సైతం వాడు వీడు అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంభోదిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: రేవంత్ ఉడుత ఊపులకు అదర బెదర


మల్లన్న మాటలు నమ్మకండి..

ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నను నమ్మకండి అంటూ బీసీలకు సూచించారు. రోజుకు ఒక్క దుకాణం పెట్టే తీన్మార్ మల్లన్న బీసీలను మభ్యపెట్టి కొత్త దుకాణం తెరిచాడంటూ ఎద్దేవా చేశారు. ఈ దుకాణాన్ని సైతం ఎత్తేస్తాడని వ్యంగ్యంగా అన్నారు. తీన్మార్ మల్లన్నతో తస్మాత్ జాగ్రత్త అంటూ బీసీలకు ఈ సందర్బంగా నిఖిల్ రెడ్డి హితవు పలికారు.

Also Read: రోజమ్మ నీకో న్యాయం..మాకో న్యాయమా ..!


స్థానిక సంస్థల ఎన్నికల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం..

నిన్న రెడ్డి జాగృతి నాయకులు తీన్మార్ మల్లన్న జాగ్రత్త అంటూ హెచ్చరించారని గుర్తు చేశారు. రెడ్డి కులాన్ని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటూ అతడికి సూచించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీలోని రెడ్డి నేతలతోపాటు ముఖ్యమంత్రిని సైతం విమర్శించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిపై నోరు జారడం, బూతులు తిట్టడం ఏమిటని తీన్మార్ మల్లన్న వైఖరిని ఆయన ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీలో నీకంటే ముందు దశాబ్దాలుగా ఉన్న బీసీ లీడర్లు ఎంత గౌరవంగా ఉన్నారో చూసి నేర్చుకోవాలంటూ తీన్మార్ మల్లన్నకు ఈ సందర్బంగా హితవు పలికారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రెడ్డిలు, బీసీల మధ్య చిచ్చు పెట్టి.. వివాదం రాజయాలనే ఆలోచనలో తీన్మార్ మల్లన్న ఉన్నారని నిఖిల్ రెడ్డి ఆరోపించారు.

Also Read: పుట్టగొడుగులు తినడం వల్ల ఇన్ని లాభాలా..?


ఇంతకీ ఏం జరిగిందంటే..

నవంబర్ 03వ తేదీ ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో బీసీ గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అన్ని వేల కోట్ల రూపాయిల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నావంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీన్మార్ మల్లన్న నిప్పులు చెరిగారు.


రేవంత్, బత్తులకు ఇదే లాస్ట్..

ఇక తెలంగాణ రాష్ట్రానికి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అదే విధంగా మిర్యాలగూడకు ఓసీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డిలకు ఇదే అఖరి అవకాశమన్నారు. తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరాన్నారు. ఆ తర్వాత అతడికి ఎమ్మెల్సీ పదవి కేటాయించారని పార్టీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.


ఆ పార్టీ నాయకుడి అండ దండా చూసుకుని..

అయితే పార్టీ ద్వారా పదవి అందుకున్న తీన్మార్ మల్లన్న ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి వెనుక బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారని ఆరోపించారు. మరోవైపు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై నల్గొండ జిల్లా పార్టీ నేతలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

For Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 06:23 PM