BJP: కొత్త సంవత్సరంలో కొత్త బాస్‌లు.. కమలం పార్టీలో నయా జోష్
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:36 PM
తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నా.. ఆ పార్టీ చేస్తున్న తప్పిదాలు, అంతర్గత కుమ్ములాటల కారణంగా అధికారంలోకి వచ్చే అవకాశాలను చేజార్చుకుంటోంది. కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తన బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో బలపడేందుకు ఆ పార్టీ శ్రమిస్తోంది. రానున్న కొత్త సంవత్సరమైనా దక్షిణాది రాష్ట్రాల్లో..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ వ్యాప్తంగా తన బలాన్ని పెంచుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఇప్పటివరకు అధికారంలోకి రాని రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతుంది. గతంతో పోలిస్తే కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగ్గా ఉన్నా.. సొంతంగా బలపడే పరిస్థితి కనిపించడంలేదు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నా.. ఆ పార్టీ చేస్తున్న తప్పిదాలు, అంతర్గత కుమ్ములాటల కారణంగా అధికారంలోకి వచ్చే అవకాశాలను చేజార్చుకుంటోంది. కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తన బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో బలపడేందుకు ఆ పార్టీ శ్రమిస్తోంది. రానున్న కొత్త సంవత్సరమైనా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. కొత్త సంవత్సరం బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు వివిధ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించనున్నారు. కొత్త అధ్యక్షులు అయినా ఆ పార్టీ కేడర్‌లో నయా జోష్ నింపి.. పార్టీ బలాన్ని పెంచుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
జనవరిలో కొత్త అధ్యక్షులు..
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తిచేసుకుని, బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే బూత్ స్థాయి కమిటీలను పూర్తిచేయగా, మండల, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటుచేస్తున్నారు. జనవరి మొదటి వారంలో బీజేపీ వివిధ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కొత్త రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర అధ్యక్షుల నియామకం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని నియమించనున్నారు. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎఐసిసి అధ్యక్షుడిగా కర్ణాటకు చెందిన మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో.. బీజేపీ సైతం అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీకి కొత్త అధ్యక్షులను నియమించే ఛాన్స్ ఉండగా.. ఏపీకి తిరిగి పురంధేశ్వరిని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది ఉత్కంఠగా మారింది. బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారని చర్చ జరుగుతుండగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందనేది వేచి చూడాలి.
కేడర్‌లో జోష్ నింపుతారా..
తెలంగాణలో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు హైదరాబాద్ మహా నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. కొత్త సంవత్సరంలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారు. గతంలో బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా నియమించిన తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బండి సంజయ్ కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలపర్చేందుకు కృషిచేశారు. కొత్త అధ్యక్షులు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తారా.. కేడర్‌లో జోష్ నింపుతారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here