Share News

Kaleshwaram Commission: నేటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ

ABN , Publish Date - Sep 24 , 2024 | 09:06 AM

కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మళ్లీ మంగళవారం నుంచి జరగనుంది. ఈరోజు కమిషన్ ఎదుట విచారణకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇంజనీర్లు హాజరుకానున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు బహిరంగ విచారణ కొనసాగనుంది. 45 మంది ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, అకౌంట్స్ అధికారులను కమిషన్ విచారించనుంది.

Kaleshwaram Commission: నేటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) బహిరంగ విచారణ (Public ్earing) మళ్లీ మంగళవారం నుంచి జరగనుంది. ఈరోజు కమిషన్ ఎదుట విచారణకు మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల ఇంజనీర్లు (Sundilla Engineers) హాజరుకానున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు బహిరంగ విచారణ కొనసాగనుంది. 45 మంది ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, అకౌంట్స్ అధికారులను కమిషన్ విచారించనుంది.

మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లను బాధ్యులను చేయనున్నారా.. ఇప్పటి వరకు పూర్తి అయిన విచారణ ప్రకారం ఏఈల నుంచి ఈఎన్‌సీల వరకు దాదాపు 20 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా.. ఈ ప్రశ్నలకు అవుననే కమిషన్ వర్గాలు అంటున్నాయి. పలువురు ఇంజనీర్ల అవినీతి, అలసత్వం, బ్యారేజీల వైఫల్యానికి కారణమని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విచారణను తప్పుదోవ పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్స్ చేసే యోచనలో కమిషన్ ఉంది. అవినీతి నిరోధక చట్టం కింద వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిషన్ భావిస్తోంది.


కాగా విచారణలో భాగంగా కమిషన్‌ మూడు రోజుల క్రితం పలువురు అధికారులను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి ముందు, నిర్మాణం జరిగేటప్పుడు, జరిగాక.. మోడల్‌ స్టడీస్‌ ఏమైనా జరిగాయా? అని చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీదేవిని కమిషన్‌ ప్రశ్నించగా.. చేశారని ఒకసారి, చేయలేదని మరోసారి ఆమె జవాబు చెప్పారు. దాంతో కమిషన్‌ ‘అఫిడవిట్‌’ను చూపిస్తూ... ‘‘మీరు దాఖలు చేసిన అఫిడవిట్‌ ఇది. ఇందులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉన్నారా?’’ అని నిలదీసింది. దీనికి ఆమె నుంచి ఏ సమాధానమూ రాకపోవడంతో.. ‘స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్‌డీఎస్‌వో) సీఈగా మీ బాధ్యతలేంటి?’ అని కమిషన్‌ మరో ప్రశ్న వేసింది. దానికీ ఆమె నీళ్లు నమిలారు.

ఆ తర్వాత.. ఐఎస్‌కోడ్‌ (భారతీయ ప్రమాణాల సంస్థ కోడ్‌) ఏం చెబుతోంది? అది అమలు జరిగిందా? అని ప్రశ్నించగా.. వాటికి కూడా జవాబు చెప్పలేదు. దాంతో కమిషన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కమిషన్‌ ప్రశ్నలకు జవాబు చెప్పే పద్ధతి ఇదేనా? అఫిడవిట్‌లోని అంశాలకు కట్టుబడి ఉండకపోతే ఎలా? పొంతనలేని జవాబులు చెబుతారా’ అని మండిపడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదలు ఎప్పుడొచ్చాయి అనే ప్రశ్నకు ‘తెలియదు’ అని.. 2020లో త్రీడీ మోడల్‌ స్టడీస్‌ బ్యారేజీలపై జరిగాయా అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబిచ్చారామె. ‘తెలంగాణ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ (టీఎస్‌ఈఆర్‌ఎల్‌) 2023లో మోడల్‌ స్టడీస్‌ చేసి, నివేదిక ఇచ్చిన విషయం మీకు తెలుసా’ అనే ప్రశ్నకు ఆమె... ‘నాకు తెలియదు’ అని జవాబు చెప్పడంతో కమిషన్‌ కంగుతింది. విచారణ జరిగినంత సేపు ఇలా ఆమె ‘తెలియదు... గుర్తులేదు... మరిచిపోయా’ తరహాలో జవాబులు చెప్పడం గమనార్హం.


ఐఎస్‌ కోడ్‌ ప్రకారం మీ బాధ్యతలేంటీ...?

‘ఐఎస్‌ కోడ్‌ ప్రకారం ఎస్‌డీఎస్‌వో బాధ్యతలేంటీ...? ఐఎస్‌ కోడ్‌ 7349:2012కు అధికారులు కట్టుబడి ఉండాలా? వద్దా?’ అని ఎస్‌డీఎస్‌వో చీఫ్‌ ఇంజనీర్‌ ప్రమీలను కమిషన్‌ ప్రశ్నించింది. అయితే.. ఆ బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని ప్రమీల గుర్తుచేశారు. డ్యామ్‌సేఫ్టీ చట్టం అమల్లోకి వచ్చాకా... అందులోని క్లాజ్‌-46 ప్రకారం, వాటి కాళేశ్వరం బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలేంటని కమిషన్‌ ప్రశ్నించగా... ‘బ్యారేజీల రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డ్యామ్‌ ఓనర్‌(సంబంధిత చీఫ్‌ ఇంజనీర్‌)దే’నన్నారు. ‘గేట్ల మ్యానువల్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ప్రోటోకాల్స్‌ను బ్యారేజీల వద్ద అమలు చేశారా?’ అని కమిషన్‌ ప్రశ్నించగా.. జవాబు చెప్పడానికి ఆమె తడబడ్డారు. దీంతో కమిషన్‌..‘పేర్లు చెప్పొద్దు. మీ ఇబ్బందులు మాకు తెలుసు. ఒక ఇంజనీర్‌గా బదులివ్వండి’ అని పేర్కొంది. దాంతో.. డ్యామ్‌ సేఫ్టీ చట్టం ప్రకారం వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలను తనిఖీ చేసి, నివేదిక ఇవ్వాల్సి ఉండగా... అవి ఇవ్వలేదని ప్రమీల తెలిపారు.


ఆ తర్వాత ఇదే విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) విజయలక్ష్మిని కూడా కమిషన్‌ ప్రశ్నించింది. ‘బ్యారేజీలను డ్యామ్‌లుగా పరిగణనలోకి తీసుకుంటూ నోటిఫికేషన్‌ ఇచ్చారా? బ్యారేజీల విషయంలో మీ విధులు, బాధ్యతలేంటి?’ అని ప్రశ్నించగా... ‘వానాకాలానికి ముం దు, తర్వాత బ్యారేజీలు ఎలా ఉన్నాయనే దాన్ని పరిశీలించి, నివేదికలు ఇవ్వాల్సి ఉండగా.. ఆ నివేదికలు ఇవ్వలేదు’ అని బదులిచ్చారు. నివేదికలు ఇవ్వనందువల్లే వాటిని పరిశీలించలేకపోయామన్నారు. 2023 అక్టోబరులో బ్యారేజీ కుంగిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారని కమిషన్‌ ప్రశ్నించగా.. ఏబీ పాండ్యా నేతృత్వంలోని డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ బ్యారేజీని పరిశీలించిందని, కుంగుబాటుకు కారణాలపై స్వతంత్ర కమిటీ వేయాలని ఏబీ పాండ్యా నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు.

బ్యారేజీల నిర్మాణం జరగడానికి ముందు నమూనా అధ్యయనాలు పూర్తిస్థాయిలో జరగక ముందే నిర్మాణం ప్రారంభమైందని టీఎస్‌ఈఆర్‌ఎల్‌కు చెందిన రీసెర్చ్‌ ఇంజనీర్లు కమిషన్‌కు తెలిపారు. నీటిని నిల్వ చేయడమే మేడిగడ్డ కుంగుబాటుతో బాటు అన్నారం, సుందిళ్లలో సీపేజీలకు కారణమన్నారు. వరదలప్పుడు గేట్లు ఎత్తకపోవడం వల్ల బ్యారేజీపై నీటి ఒత్తిడి పెరిగి.. ఆ ఒత్తిడి ఇసుక పునాదుల నుంచి జారిపోవడానికి కారణమైందని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేడర్‌కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..

టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

TTD : స్పెషల్‌ దందా

జెత్వానీ కేసులో ఆ ముగ్గురు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 24 , 2024 | 09:10 AM