HYDRA News: హైడ్రా కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 26 , 2024 | 03:22 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చెరువురు ఆక్రమణలకు గురయ్యామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముందుగా రాజధాని నగరం హైదరాబాద్‌లో, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తిరిగి చెరువులుగా పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో హైడ్రా (HYDRA) కూల్చివేతలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నగరంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇవి రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని విపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండగా.. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చెరువులను సంరక్షిస్తున్నామంటూ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. హైడ్రా కూల్చివేతలపై జనాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చెరువురు ఆక్రమణలకు గురయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముందుగా రాజధాని నగరం హైదరాబాద్‌లో, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తిరిగి చెరువులుగా పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్న ప్రభుత్వ లెక్కలు, రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.
ఆ బాధ్యత స్థానికులదే..
తెలంగాణ వ్యాప్తంగా చెరువులను పరిరక్షించుకోవాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ‘‘గతంలో ఫలానా ప్రాంతంలో చెరువు ఉండేదని తెలిసిన స్థానికులు ఎవరైనా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పని, చెరువుల పరిరక్షణ స్థానికులదే. ప్రభుత్వం ఎవరి మీదా రాజకీయ కక్ష సాధింపులకు దిగదు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అని అన్నారు.
‘‘ప్రభుత్వం చేస్తున్న పనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్శిస్తున్నారు. ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే న్యాయ స్థానాలు ఉన్నాయి. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. హైదరాబాద్ ఒకప్పుడు లెక్ సిటీగా ఉండేది. చెరువుల పరిరక్షకులు అందరూ ఎక్కడెక్కడ చెరువులు అక్రందనకు గురయ్యాయో వాటి ఆధారాలు సంబంధిత అధికారులకు ఇవ్వాలి. 33 జిల్లాల్లో ఎక్కడైనా గ్రామాలు, మండలాలు, పట్టణాలు, మున్సిపాలిటీ చెరువులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాల్లో మీకు ఉన్న అవగాహన, ఆలోచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, తదితరులు హాజరయ్యారు. నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్‌ను , టీ షర్ట్‌ను ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.