Share News

Mohanbabu: మోహన్‌బాబుకు లభించని ఊరట.. అరెస్ట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:20 PM

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి. హత్యాయత్నం కేసు పెట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని మోహన్ బాబు కలిశారని ప్రతివాది తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చాలా ప్రభావంతమైన వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మోహన్‌బాబుకు..

Mohanbabu: మోహన్‌బాబుకు లభించని ఊరట.. అరెస్ట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
Mohanbabu

సినీ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. కనీసం మోహన్‌బాబును సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాది కోర్టును కోరగా న్యాయమూర్తి అంగీకరించలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు.

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి. హత్యాయత్నం కేసు పెట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని మోహన్ బాబు కలిశారని ప్రతివాది తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చాలా ప్రభావంతమైన వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును ప్రతివాది తరపు లాయర్ కోరారు. అరెస్ట్ భయంతో మోహన్‌బాబు దుబాయి పారిపోయారని కోర్టుకు చెప్పగా.. మోహన్‌బాబు తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవి చందర్ తన క్లెయింట్ దుబాయి పారిపోలేదని తెలిపారు.

మోహన్‌బాబు తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మోహన్‌బాబు ఇక్కడే ఉన్నారనే విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని ఆదేశించారు. దీనిపై మోహన్‌బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సోమవారం వరకు తన క్లెయింట్‌ను అరెస్ట్ చేయకుండా ఉపశమనం కల్పించాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం, అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ముందస్తు బెయిల్‌పై తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. సోమవారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 19 , 2024 | 04:21 PM