Share News

TTDP: టీడీపీలో పాత కమిటీలు రద్దు.. సీబీఎన్ స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:39 PM

తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి(TTDP) పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) దిశానిర్దేశం చేశారు.

TTDP: టీడీపీలో పాత కమిటీలు రద్దు.. సీబీఎన్ స్పెషల్ ఫోకస్

హైదరాబాద్: తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి(TTDP) పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేతలతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని టీడీపీ పాత కమిటీలన్నీ రద్దు చేశారు. ఇకపై అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు. సభ్యత్వాలను పెద్ద ఎత్తున నమోదు చేయించిన నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లవంటివని.. రెండు ప్రాంతాలు సమ అభివృద్ధి చెందాలనేదే టీడీపీ అభిమతమని పేర్కొన్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా.. గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. క్యాడర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ సమావేశంలో టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.


పాత కమిటీల రద్దుతో ప్రారంభం..

టీటీడీపీ ప్రక్షాళనలో భాగంగా చంద్రబాబు గతంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ టీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారిగా ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఏపీ, తెలంగాణలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.

అనంతరమే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని అంతా భావించారు. ఇదే అంశంపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మరోసారి చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఏపీ తరహాలోనే కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయడం కోసం ఇకపై ప్రతినెలలో రెండు రోజులు రాష్ట్రానికి వస్తానని బాబు చెప్పిన విషయం తెలిసిందే. అందుకు తగినట్లే ఆయన రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌కి వచ్చారు.

Updated Date - Aug 25 , 2024 | 06:13 PM