Share News

సాయికుమార్‌ హంతకులను కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:59 PM

ముప్పిరితోటలో ప్రేమ పేరుతో ఈనెల 27న జరిగిన సాయికుమార్‌ దారుణహత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పౌరహక్కుల సంఘం, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ముప్పిరి తోట గ్రామాన్ని సందర్శించారు.

సాయికుమార్‌ హంతకులను కఠినంగా శిక్షించాలి

ఎలిగేడు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ముప్పిరితోటలో ప్రేమ పేరుతో ఈనెల 27న జరిగిన సాయికుమార్‌ దారుణహత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పౌరహక్కుల సంఘం, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ముప్పిరి తోట గ్రామాన్ని సందర్శించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం సాయికుమార్‌ తల్లిదండ్రులు పూరెళ్ల జోత్స్న పర్శరాంగౌడ్‌లను పరామర్శించారు. వారు మాట్లాడుతూ గతంలో రెండుసార్లు సాయికు మార్‌పై దాడి చేసిన సందర్భంలో పోలీస్‌లు స్పందిస్తే బాగుండేదన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించి మిగితా ఇద్దరు చీకటి హరీష్‌, చీకటి మల్లయ్యను అరెస్టు చేయాలన్నారు. పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్‌, విప్లవ రచయితల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ బాలసాని రాజయ్యగౌడ్‌, పౌరహక్కుల సంఘం నాయకులు బొంకూరి లక్ష్మణ్‌, పుట్ట రాజన్న, సత్యనారాయణ, రెడ్డిరాజుల సంపత్‌ తదితరలు పాల్గొన్నారు.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్షించాలి

పెద్దపల్లిటౌన్‌, (ఆంధ్రజ్యోతి): పూరెళ్ళ సాయికుమార్‌ది పరువు హత్య కాదని, కుట్రపూరితంగా చేసిన హత్యేనని పౌరహక్కుల, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ ప్రజాఫ్రంట్‌, దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ నాయకులు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడీ సుదర్శన్‌, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ జిల్లా కన్వీనర్‌ గుమ్మడి కొమురయ్య మాట్లాడు తూ గౌడ కులానికి చెందిన సాయికుమార్‌, అదే గ్రామం ముదిరాజ్‌ కులా నికి చెందిన అమ్మాయి రెండేళ్ళుగా ప్రేమించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారం ఇష్టం లేని అమ్మాయి తల్లిదండ్రులు ముత్యం సమత, సదయ్య, బంధువు సిద్ద సారయ్య, చీకటి మల్లయ్య, చీకటి హరీష్‌ల ప్రోద్బలంతో హత్యకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. సమాజంలో ప్రేమ, కులం, మతం పేరుతో జరిగే పరువు హత్యలు, దాడుల నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ముప్పిరితోట ఘటనపై సమగ్ర విచారణ జరిపించి హంతకులను కఠినంగా శిక్షించాలని, మిగితా ఇద్దరినీ అరెస్ట్‌ చేయాలన్నారు. కేసు విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని, సాయి కుమార్‌ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్‌, విప్లవ రచయితల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ బాలసాని రాజయ్య, పౌరహక్కుల సంఘం నాయకులు బొంకూరి లక్ష్మణ్‌, ఎన్‌. సత్యనారాయణ, పుట్ట రాజన్న, రెడ్దిరాజుల సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:59 PM