Share News

‘ఇరుముడి’తోనే విమాన ప్రయాణం

ABN , Publish Date - Oct 27 , 2024 | 03:40 AM

శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తీపికబురు చెప్పారు.

‘ఇరుముడి’తోనే విమాన ప్రయాణం

  • అయ్యప్ప స్వాములకు ప్రత్యేక వెసులుబాటు

  • మకరజ్యోతి దర్శనం వరకు: రామ్మోహన్‌నాయుడు

అరసవల్లి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తీపికబురు చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కేరళలోని శబరిమలకు విమానాల్లో రావాలని భావించే మాలధారులు ఇరుముడితోనే విమానాల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. అయ్యప్ప భక్తుల వినతి మేరకు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. సడలించిన నిబంధనలకు అనుగుణంగా పౌరవిమానయాన భద్రతా విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. మంత్రి శనివారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు.


భద్రతా కారణాల రీత్యా విమానంలో కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని ఇన్నాళ్లూ అనుమతించలేదన్నారు. దీంతో స్వాములు రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేదని తెలిపారు. అయ్యప్ప భక్తుల విజ్ఞప్తి మేరకు నిబంధనలు సడలించామని, ఈ సౌలభ్యం మకరజ్యోతి దర్శనం ముగిసేవరకు(జనవరి 20) ఉంటుందని తెలిపారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది స్కానింగ్‌ చేసిన తర్వాత భక్తులు నేరుగా ఇరుముడితో విమానాల్లో ప్రయాణం చేయవచ్చన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 03:40 AM