Share News

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనానికి కవితకు బెయిల్‌ సంకేతం!

ABN , Publish Date - Aug 28 , 2024 | 05:53 AM

లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు బెయిల్‌.. బీజేపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనానికి సంకేతమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనానికి కవితకు బెయిల్‌ సంకేతం!

  • లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల పొత్తు.. మోదీకి కేసీఆర్‌ ఇచ్చే రిటన్‌ గిఫ్ట్‌ ఇదే

  • 17 నెలల దాకా సిసోడియాకు బెయిలే రాలేదు

  • లిక్కర్‌ మాఫియాకు కింగ్‌ అయిన కవితకు ఐదు నెలల్లో ఎలా వచ్చింది?

  • తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌

  • కవితకు బెయిల్‌ వస్తుందని ముందే కేటీఆర్‌ ఎలా చెబుతారు?

  • ఆయనపై కోర్టు చర్యలు తీసుకోవాలి: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు బెయిల్‌.. బీజేపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనానికి సంకేతమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుంటాయని వ్యాఖ్యానించారు. కవిత బెయిల్‌కుగాను ప్రధాని మోదీకి కేసీఆర్‌ ఇచ్చే రిటన్‌ గిఫ్ట్‌ ఇదేనన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో బీఆర్‌ఎస్‌ పార్టీ చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్‌ వచ్చిందని ఆరోపించారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేని బీజేపీ.. ఇక్కడి అధికార కాంగ్రె్‌సను దెబ్బతీసేందుకు బీఆర్‌ఎ్‌సను కలుపుకొనిపోయే పనిలో ఉందన్నారు. కవిత బెయిల్‌ కండిషన్‌లో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ డమ్మీ పాత్ర పోషించిందని, బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయించిందని ఆరోపించారు. ‘‘మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తది అనే పరిస్థితి నుంచి మూడో స్థానానికి ఎందుకు పడిపోయింది? కవిత కోసం సొంత లోక్‌సభ నియోజకవర్గాన్నే కేసీఆర్‌ వదులుకున్నడు. ఆ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు నాలుగు సీట్లు తగ్గడానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పోవడమే కారణం’’ అన్నారు. బీజేపీ గెలిచిన లోక్‌సభ నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలనగా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏజెంట్లే లేరని, ఆ పార్టీ ఎమ్మెల్యేలూ పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాలేదని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులూ.. ఓట్లు బీజేపీకి వేయాలని ప్రచారం చేశారని ఆరోపించారు. ఉత్తరాదిన బలహీనపడిన బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఏపీలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో పొత్తు పెట్టుకుని సీట్లు గెలిచిందన్నారు. తెలంగాణలో బెయిల్‌ కండిషన్‌ ముందు పెట్టి బీఆర్‌ఎ్‌సను బలహీన పరచడం ద్వారా సీట్లు గెలుచుకుందన్నారు. బీజేపీకి ఒక పావులాగా బీఆర్‌ఎస్‌ పార్టీ పనిచేస్తోందన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీని బలహీన పరిచేందుకు బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు ఒక ఒప్పందానికి వచ్చాయని, ఇందులో భాగంగా తొలుత బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం కాబోతున్నట్లు ప్రచారం చేసి.. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన అన్నారు.


కేటీఆర్‌పై కోర్టు చర్యలు తీసుకోవాలి

బెయిల్‌కు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు.. జడ్జి ప్రకటించే దాకా బెయిల్‌ వస్తుందా.. రాదా? అన్నది తెలిసే అవకాశమే లేదని, కానీ.. కవితకు బెయిల్‌ వస్తుందంటూ కేటీఆర్‌తో పాటుగా బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా గత మూడు రోజులుగా ప్రచారం చేస్తోందన్నారు. బెయిల్‌ వస్తుందంటూ ముందే చెప్పిన కేటీఆర్‌పైన కోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తామేమీ జడ్జిని తప్పు పట్టడంలేదని, బెయిల్‌ వస్తుందంటూ జడ్జి చెప్పకముందే బీఆర్‌ఎస్‌ పార్టీ చెప్పుకుందన్నదే తమ వాదనన్నారు. కవితకు బెయిల్‌ వస్తుందంటూ మూడు రోజుల ముందే హడావుడి చేసినందుకు కేసీఆర్‌ కుటుంబంపై న్యాయవ్యవస్థ చర్యలు తీసుకోవాలన్నారు.


ఐదు నెలల్లోనే కవితకు బెయిల్‌ ఎలా?

లిక్కర్‌ కేసులో సిసోడియాకు 17 నెలల తర్వాత బెయిల్‌ వస్తే.. లిక్కర్‌ మాఫియాకు కింగ్‌ అయిన కవితకు ఐదు నెలల్లోనే బెయిల్‌ ఎలా వచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆమెకు బెయిల్‌.. బీజేపీతో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగమేనన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 05:53 AM