Share News

Minister Tummala: ఆ గ్రామ పంచాయతీలు విలీనం చేయాలంటూ రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ..

ABN , Publish Date - Jul 02 , 2024 | 05:27 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్‌లో విలీనమైన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేలా చొరవ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈనెల ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Minister Tummala: ఆ గ్రామ పంచాయతీలు విలీనం చేయాలంటూ రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ..

ఖమ్మం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్‌లో విలీనమైన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేలా చొరవ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈనెల ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు పంచాయతీలను భద్రాచలంలో కలపాలంటూ మంత్రి లేఖలో పేర్కొన్నారు.


రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో మెుత్తం ఏడు మండలాలు విలీనం అయ్యాయి. భద్రాచలం పట్టణం మినహా మండలంలోని గ్రామ పంచాయతీలు ఏపీలో విలీనం అయిన సంగతి తెలిసిందే. శ్రీరాముడు కొలువైన రామాలయంతో టెంపుల్ టౌన్‌గా భద్రాచలాన్ని ఏర్పాటు చేశారు. పట్టణం శివారు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనకావడంతో డంపింగ్ యార్డుకు సైతం స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మంత్రి తెలిపారు. భద్రాచలం- చర్ల ప్రధాన రహదారిలో ఎటపాక గ్రామ పంచాయతీ ఆంధ్రాలో కలవడంతో అంతరాష్ట్ర సరిహద్దు సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి వివరించారు. విలీన గ్రామాల వల్ల భద్రాచలం నుంచి చర్ల వెళ్లేవారికి రాకపోకల్లో, అధికారులకు సాంకేతిక, పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు.


భద్రాచలం రామాలయం దేవస్థాన భూములు పురుషోత్తమపట్నం గ్రామంలో ఉండటంతో ఆలయ అధికారుల పర్యవేక్షణకు పాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నట్లు మంత్రి తుమ్మల లేఖలో సీఎంకు వివరించారు. భద్రాచలం ఆనుకొని ఉన్న 5గ్రామ పంచాయతీలు తమను తెలంగాణలో కలపాలంటూ తీర్మానాలు చేశారని చెప్పారు. ప్రజల ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని భౌగోళిక పరమైన విభజనతో ఇబ్బందులు పడుతున్న గ్రామ పంచాయితీలను తిరిగి తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలనా సౌలభ్యం, ప్రజా సంక్షేమం కోసం భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Updated Date - Jul 02 , 2024 | 05:43 PM