Share News

KTR: రుణమాఫీపై తలో మాట..

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:15 AM

రుణమాఫీపై సీఎం, మంత్రులు తలో మాట చెబుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

KTR: రుణమాఫీపై తలో మాట..

  • రైతులతో చెలగాటమాడుతున్న సర్కారు

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం

  • సోనియా కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారా?

  • అందుకే హెరాల్డ్‌ కేసులో బెయిలొచ్చిందా? అని ప్రశ్న

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీపై సీఎం, మంత్రులు తలో మాట చెబుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రైతు రుణమాఫీకి రూ.7,500 కోట్లు విడుదలయ్యాయని ఆర్థిక మంత్రి చెబుతుంటే.. రూ.17 వేల కోట్లు చేసినట్లు ఇతర మంత్రులు చెబుతున్నారన్నారు. సీఎం అయితే ఏకంగా రూ.31 వేల కోట్లతో అందరికీ మాఫీ చేసేసినట్లు ప్రకటించారని.. వ్యవసాయ మంత్రేమో ఇంకా మాఫీ చేయాల్సి ఉందని అంటున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.


ఇలా ఎవరికి తోచింది వారు చెబుతున్నారని, ఇందులో ఏది నిజమని నిలదీశారు. కాంగ్రెస్‌ సర్కారు రైతులతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని, కవిత బెయిలు అంశంతోనూ రాజకీయ ప్రయోజనం పొందేందుకు కుటిల యత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ కూడా ఎన్డీయేతో కుమ్మక్కైతేనే 2015లో నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌ కి బెయిల్‌ వచ్చిందా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలన్నారు.


ఇవన్నీ ఎన్డీయే హయాంలో జరిగినవేనని, అంటే వీరంతా ఎన్డీయే భాగస్వాములేనా? అని నిలదీశారు. ‘మళ్లీ చెబుతున్నా. మేం అధికారంలోకి వచ్చాక తెలంగాణకు అక్కరకు రాని బొమ్మలను తొలగిస్తాం. రాసిపెట్టుకో’ అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ ఎక్స్‌లో హెచ్చరించారు. రేవంత్‌ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహంపెట్టినా అవమానమేనన్నారు. గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్లుగా ఉంటుందని విమర్శించారు. కాగా, రష్యాకు చెందిన స్కోల్‌కోవో స్టార్టప్‌ మాస్కోలో సెప్టెంబరు 5 నుంచి 7 వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది.

Updated Date - Aug 29 , 2024 | 04:15 AM