Nagarjuna Sagar: లాంచీలో చలో చలో..
ABN , Publish Date - Nov 03 , 2024 | 04:34 AM
నల్లమల అందాల మధ్య కృష్ణమ్మ ఒడిలో లాహిరి లాహిరి లాహిరిలో అంటూ నాగార్జున సాగర్ నుంచి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి శనివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాంచీ ప్రయాణం ప్రారంభమైంది.
సాగర్-శ్రీశైలం మధ్య ప్రయాణం మళ్లీ ప్రారంభం
ఇటు సోమశిల నుంచి శ్రీశైలానికి కూడా..
లక్నవరం సరస్సు మరింత ఆకర్షణీయం
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాట్లు
గోవిందరావుపేట, నాగార్జునసాగర్, కొల్లాపూర్, హైదరాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): నలమల అందాల మధ్య కృష్ణమ్మ ఒడిలో లాహిరి లాహిరి లాహిరిలో అంటూ నాగార్జున సాగర్ నుంచి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి శనివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. 85 మంది పర్యాటకులతో 110 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలానికి 6 గంటల పాటు ఈ ప్రయాణం సాగింది. పర్యాటకుల ఆదరణ మేరకు బుధ, శనివారాల్లో లాంచీలను నడుపుతామని అధికారులు తెలిపారు. కృష్ణా నదిపై నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శీశైలం వరకు లాంచీ ప్రయాణం శనివారమే ప్రారంభమైంది. ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలను వీక్షిస్తూ పర్యటకులు ఈ ప్రయాణాన్ని ఆస్వాదించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో సోమశిల నుంచి బయల్దేరిన లాంచీ 7 గంటల అనంతరం శ్రీశైలం పాతాళ గంగ చేరింది. ఆదివారం ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభమై సాయంత్రం 4 గంటల సమయానికి సోమశిలకు రానుంది.
లక్నవరం పిలుస్తోంది..
ద్వీపాలు.. ద్వీపకల్పాలు.. కొండలు.. సరస్సులు.. అడవులు.. ఇలా ఎటుచూసినా ప్రకృతి రమణీయత ఉట్టిపడే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు కొంగొత్త అందాలను సంతరించుకుంది. ఊయల వంతెనలు, దీవులు, కాటేజీలు, బోటింగ్‌తో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త రూపు దాల్చింది. పచ్చిక బయళ్లు, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, పిల్లల పార్కు, సాహస క్రీడలు, వాటర్ స్పోర్ట్స్‌తో సరస్సులోని మూడో దీవి పర్యటక కేంద్రంగా అవతరించింది. మినీ బార్, బాంక్వెట్ హాల్, కాటేజీలు, రాత్రివేళ క్యాంప్ ఫైరింగ్ ఏర్పాటు చేశారు. అటవీ, పర్యటక శాఖల సంయుక్త భాగస్వామ్యంతో ట్రెక్కింగ్ లాంటి సదుపాయాలు కల్పించిన నిర్వాహకులు ఇక నుంచి వారాంతాల్లో మరచిపోలేని అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి, రెండో దీవుల్లో కూడా ఇదే తరహా సదుపాయాలు కల్పిస్తే లక్నవరం రాష్ట్ర పర్యాటకానికి తలమానికం కానుంది.
నాగార్జునసాగర్-శ్రీశైలం రివర్ కమ్ క్రూయిజ్ ప్యాకేజీ
వన్ వే విత్ వెజ్ లంచ్ పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు (5-12 సంవత్సరాలు)రూ.1600
టూవే విత్ వెజ్ లంచ్ పెద్దలకు రూ.3వేలు, పిల్లలకు (5-12 సంవత్సరాలు)రూ.2400
సోమశిల-శ్రీశైలం
రివర్ కమ్ క్రూయిజ్ ప్యాకేజీ
వన్ వే విత్ వెజ్ లంచ్ పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు (5-12 సంవత్సరాలు)రూ.1600
టూవే విత్ వెజ్ లంచ్ పెద్దలకు రూ.3వేలు, పిల్లలకు (5-12 సంవత్సరాలు)రూ.2400
సంప్రదించాల్సిన నంబర్లు:
నాగార్జునసాగర్-శ్రీశైలం ప్యాకేజీ 9848540371, 7997951023,
సోమశిల-శ్రీశైలం ప్యాకేజీ
9848540371, 7731854994
పొగమంచు కమ్ముకొంది
పెంచికలపేట/చింతలమానేపల్లి, నవంబరు2(ఆంధ్రజ్యోతి): కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చలి మొదలైంది. రాత్రిపూట మంచు కురుస్తుండడంతో పాటు ఉదయం వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. శనివారం పెంచికటపేట, చింతలమానేపల్లి మండలాల్లో ప్రధాన రహదారిపై ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం 10 దాటినా సూర్యుడు కనిపించకపోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
మచిలీపట్నంలో ముగ్గురు మైనర్ బాలుర మిస్సింగ్ కలకలం..
జగన్‌ను శిక్షించాలా.. వద్దా..: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News, AP News and Telugu News