Share News

Net-Zero City: నాలుగో నగరం..

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:12 AM

మహేశ్వరం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Net-Zero City: నాలుగో నగరం..

  • మహానగరంలా మారనున్న మహేశ్వరం

  • ముచ్చెర్లలో కాలుష్య రహిత నెట్‌జీరో సిటీ

  • శంషాబాద్‌ నుంచి మెట్రో వేల ఎకరాల్లో ఐటీ కంపెనీలు

  • పర్యాటకం, విద్య, ఆరోగ్యం, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే యత్నం

  • విదేశీ కంపెనీలను ఆకర్షించే దిశగా సర్కారు చర్యలు

రంగారెడ్డి అర్బన్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మహేశ్వరం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముచ్చెర్లలో ఫార్మాసిటీ కోసం గతంలో సేకరించిన 12 వేల ఎకరాలకు పైగా భూమిలో కాలుష్యరహిత నెట్‌జీరో సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో పలు కాలుష్యరహిత కంపెనీలను ఏర్పాటు చేయనుంది. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఇక మహేశ్వరం చుట్టుపక్కల ఉన్న మరికొంత ప్రభుత్వ భూమిని కూడా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని ‘వ్యాపార కేంద్రం (బిజినెస్‌ సెంటర్‌)’గా మార్చాలని రేవంత్‌ సర్కారు యోచిస్తోంది. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీ ప్రస్తావన చేశారు.


తాము ఫార్మాసిటీ అనకుండా ఫార్మా విల్లేజెస్‌ అంటున్నామన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ తర్వాత అక్కడ 4000 ఎకరాల్లో నాలుగో సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్కిల్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, హెల్త్‌ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మొత్తంమీద ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో మహేశ్వరం నియోజకవర్గం ఒక ‘మహానగరం’గా రూపాంతరం చెందనుంది.


ఇక ముచ్చెర్లలో ఏర్పాటు చేసే నెట్‌జీరో సిటీని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అనుసంధానిస్తూ మెట్రో రైలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. అలాగే ఇక్కడి నుంచి ఆదిభట్ల, తుక్కుగూడ మధ్య ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు కలిసే విధంగా 150 అడుగుల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యాటకం, విద్య, వినోదం, ఆరోగ్యం, కృత్రిమ మేధ హబ్‌గా మహేశ్వరం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది.


  • మూడు క్లస్టర్లుగా..

నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం.. వాటిని మూడు క్లస్టర్లుగా విభజించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపలి భాగాన్ని అర్బన్‌ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, ఆర్‌ఆర్‌ఆర్‌ వెలుపలి ప్రాంతాన్ని రూరల్‌ క్లస్టర్‌గా ఏర్పాటు చేయనుంది. ఆయా క్లస్టర్ల అభివృద్ధికి ఏం చేయాలనేదానిపై సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే కోకాపేట ప్రాంతం అభివృద్ధిలో దూసుకెళుతోంది. మహేశ్వరం కూడా అదేబాటలో పయనించనుంది. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఓఆర్‌ఆర్‌కు బయట, ఆర్‌ఆర్‌ఆర్‌కు లోపల భూములను గుర్తిస్తున్నారు. ఈ ప్రాంతానికి విదేశీ కంపెనీలను ఆకర్షించాలంటే ఎలాంటి భూ సమస్యలూ లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.


  • అత్యధిక పరిశ్రమలు ఇక్కడే..

ప్రభుత్వ గణాంకాల ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని వివిధ కంపెనీల్లో 8,27,447 మంది ఉపాధి పొందుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోనే అత్యధికంగా చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో ప్రధానంగా విప్రో, మలబార్‌ గోల్డ్‌, సింపాల్‌, అమెజాన్‌, వెమ్‌ టెక్నాలజీస్‌, రేడియన్స్‌ ఎలకా్ట్రనిక్స్‌, వెంకటేశ్వర, టాటా ఏరోస్పేస్‌, ఎలకా్ట్రనిక్‌ సిటీ, ఇండస్ట్రియల్‌ పార్కులు వచ్చాయి. దేశంలోనే రెండో పెద్ద (765/400కేవీ) పవర్‌ గ్రిడ్‌ను కందుకూరులో ఏర్పాటు చేశారు.


అలాగే 45 ఎకరాల్లో అమెజాన్‌ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రావిర్యాలలో ఫాక్స్‌కాన్‌ కంపెనీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి గత ప్రభుత్వం 12 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. ఈ ప్రక్రియలో కొందరు రైతులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి తప్పులు పునరావృతమవకుండా ఉండేందుకు రేవంత్‌ సర్కారు చర్యలు తీసుకుంటోంది. భూములిచ్చిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని యోచిస్తోంది.

Updated Date - Aug 01 , 2024 | 04:12 AM