Bowenpally: అనారోగ్యంతో ఉన్న తల్లిని రోడ్డుపై వదిలేసి..
ABN , Publish Date - Jul 30 , 2024 | 03:21 AM
కనీపెంచిన తల్లి.. అతడికి బరువైంది. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స చేయాల్సింది పోయి.. అత్యంత నిర్దయగా రోడ్డు మీద పడేసి వెళ్లాడు! అయినా ఆమె ప్రాణం ఆ కొడుకు కోసమే తల్లడిల్లింది.
కన్నకొడుకు నిర్వాకం.. ఆకలిదప్పులతో రెండ్రోజులు పుట్‌పాత్‌పైనే
ఆస్పత్రిలో మృతి.. తుదిశ్వాస వరకూ కొడుకు గురించే ఆలోచన
బోయిన్పల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కనీపెంచిన తల్లి.. అతడికి బరువైంది. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స చేయాల్సింది పోయి.. అత్యంత నిర్దయగా రోడ్డు మీద పడేసి వెళ్లాడు! అయినా ఆమె ప్రాణం ఆ కొడుకు కోసమే తల్లడిల్లింది. కొడుకును చూడాలని ఉందంటూనే కన్నుమూసింది. మానవతావాదులను కన్నీరు పెట్టించేలా ఉన్న ఈ ఘటన బోయిన్పల్లి పరిధిలో జరిగింది. సీఐ లక్ష్మీనారాయణరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడ్చల్ ఫిష్ మార్కెట్ వద్ద శ్యామల (60), ఆమె కుమారుడు అరవింద్ నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నెల 5న శ్యామలను అరవింద్ బోయిన్పల్లి చెక్‌పోస్టు సమీపంలో ఎంఎంఆర్ గార్డెన్ వద్ద ఫుట్‌పాత్‌పై వదిలేసి.. ఇప్పుడే వస్తానంటూ ఆమెకు చెప్పి వెళ్లిపోయాడు.
రెండ్రోజులుగా ఆకలితో అలమటిస్తూ కుమారుడు వస్తాడని ఎదురుచూస్తూ.. చివరకు ఆ ఫుట్‌పాత్‌పైనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులొచ్చి 108లో ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మూడురోజుల క్రితం కొద్దిగా ఆమె కోలుకోగా పోలీసులు వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాను చనిపోయేలోపు ఒక్కసారైనా కొడుకును చూడాలని ఉందని ఆమె చెప్పింది. అరవింద్ కోసం పోలీసులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గాంధీ అస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.