Nagarjuna Sagar: సాగర్‌కు భారీ వరద!
ABN , Publish Date - Aug 03 , 2024 | 03:17 AM
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి ఆల్మట్టి దాకా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చిచేరుతోంది. ప్రధానంగా శ్రీశైలాన్ని నింపి.. నాగార్జునసాగర్ దిశగా కదులుతున్న కృష్ణవేణి ఆ ప్రాజెక్టును కళకళలాడిస్తోంది. వరద క్రస్ట్ గేట్లను తాకింది.
నాగార్జున క్రస్ట్‌గేట్లను తాకిన నీటి మట్టం
శ్రీశైలం నుంచి 5.56 లక్షల ప్రవాహం
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి ఆల్మట్టి దాకా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చిచేరుతోంది. ప్రధానంగా శ్రీశైలాన్ని నింపి.. నాగార్జునసాగర్ దిశగా కదులుతున్న కృష్ణవేణి ఆ ప్రాజెక్టును కళకళలాడిస్తోంది. వరద క్రస్ట్ గేట్లను తాకింది. మరో మూడు రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని సమాచారం ఉంది. అయితే ఏ క్షణమైనా సాగర్ గేట్లు తెరిచే అవకాశం ఉందని, అదికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ సూచించారు క్రస్ట్ గేట్లు ఎత్తే సమయంలో మొరాయించకుండా గేట్లకు సర్వీసింగ్, గ్రీసింగ్ పనులు చేశారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 5.39 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
శ్రీశైలం నుంచి రెండు వైపులా జలవిద్యుదుత్పత్తి కోసం 5.56 లక్షల క్యూసెక్కులను సాగర్‌కు వదులుతున్నారు. ఫలితంగా సాగర్ కూడా వేగంగా నిండుతోంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా... ప్రాజెక్టులోకి 211.10 టీఎంసీల నిల్వ ఉంది. తుంగభద్ర జలాశయానికి 1.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సుంకేసులకు 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అంతే ఔట్‌ఫ్లో ఉంది. గోదావరి బేసిన్‌లో ప్రధానంగా సాగునీరు అందించే ప్రధాన ప్రాజెక్టులకు వరద నిరాశజనకంగానే ఉంది. సముద్రంలోకి నీటిని వదిలేసే ప్రాజెక్టులకే భారీగా వరద వస్తోంది. కాగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ వర్షం పడింది. రామన్నగూడెంలో భారీ వేప చెట్టు కూలడంతో రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి.