Share News

Ponguleti: సంక్రాంతిలోపు.. కొత్త సర్పంచ్‌లు

ABN , Publish Date - Nov 03 , 2024 | 03:26 AM

రాష్ట్రంలోని గ్రామాల్లో సంక్రాంతిలోపు కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు వస్తారని, డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Ponguleti: సంక్రాంతిలోపు.. కొత్త సర్పంచ్‌లు

  • డిసెంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు

  • వచ్చే 4 ఏళ్ల ఒక నెలపాటు రేవంత్‌రెడ్డే సీఎం

  • 2 రోజులు అటూఇటుగా రాజకీయ బాంబులు

  • 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

  • 20లోపు లబ్ధిదారుల జాబితాలు ఖరారు

  • మహిళల పేర మంజూరు.. 4 దశల్లో సాయం

  • పథకం పర్యవేక్షణకు 16 శాఖల ఇంజినీర్లు

  • మమ్మల్ని మళ్లీ అధికారంలోకి తెచ్చేది ఇదే..

  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామాల్లో సంక్రాంతిలోపు కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు వస్తారని, డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే నాలుగేళ్ల ఒక నెల పాటు (ఐదేళ్ల పదవీకాలం వరకూ) రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని, అందులో ఎలాంటి సందేహాలు లేవన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అనంతరం మళ్లీ సీఎం ఎవరన్న విషయాన్ని తమ పార్టీ జాతీయ కమిటీ (ఏఐసీసీ) నిర్ణయిస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది జూన్‌-డిసెంబర్‌ మధ్య రాష్ట్రానికి కొత్త సీఎం వస్తారంటూ బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పొంగులేటి ఈ వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాల మాటలు, ఆరోపణలు టీ కప్పులో తుపాను లాంటివంటూ కొట్టివేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పరిష్కరిస్తామన్నారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాతో మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా దీపావళికి ముందే పొలిటికల్‌ బాంబులు పేలుతాయన్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. రెండురోజులు అటూ ఇటుగా పేలుతాయి, అప్పుడు చూస్తారుగా అని సమాధానమిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 6 నుంచి మొదలు పెడతామని, మొదటివిడత కింద సొంత స్థలం ఉన్నవారికి, రెండో విడతలో స్థలం లేనివారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.


ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే వెంటనే ఇస్తామని, లేదంటే వేరేచోట స్థలం కొనుగోలు చేసైనా 75 గజాల చొప్పున స్థలం ఇస్తామన్నారు. 6వ తేదీ నుంచి లబ్ధిదారులను గుర్తించి, 15-20వ తేదీల్లోపు జాబితాను ఖరారు చేసి, ఆ తర్వాత ఇళ్ల మంజూరు ప్రక్రియను చేపడతామని తెలిపారు. నియోజకవర్గానికి 3,500-4,000 ఇళ్లను అందించే అవకాశం ఉందని, గ్రామసభలు నిర్వహించి, ఇందిరమ్మ కమిటీల ఎంపిక మేరకు లబ్ధిదారులను ఖరారు చేయనున్నట్టు పేర్కొన్నారు. రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు దశల్లో అందిస్తామని, పునాది దశలో రూ.లక్ష, ఆ తర్వాత రూ.1.25 లక్షలు, స్లాబ్‌ దశలో రూ.1.75 లక్షలు, పూర్తయ్యాక రూ.లక్ష అందజేస్తామని పొంగులేటి వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకాన్ని మహిళ పేరు మీదే మంజూరు చేయనున్నామని, ఒకవేళ మహిళ లేకపోతే ఇంటిపెద్దగా ఉన్న వ్యక్తి పేరు మీద ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఒక్కో ఇల్లు 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తక్కువ లేకుండా కిచెన్‌, బాత్రూమ్‌ ఉండేలా నిర్మించుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఎవరైనా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకోవాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంటు, ఇనుమును తక్కువ ధరకు అందించే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి.. కంపెనీలతోనూ చర్చించి, ఒక నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి వెల్లడించారు.


  • ప్రత్యేక యాప్‌లో లబ్ధిదారుల వివరాలు

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పర్యవేక్షించేందుకుగాను ఒక యాప్‌ను రూపొందించామని, అధికారులు లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి వివరాలను ఆ యాప్‌లో పొందుపరుస్తారని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)తో అనుసంధానించనున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో నమోదు చేసిన వివరాలను కేంద్రం తాలూకు యాప్‌లకు కూడా బదిలీ చేస్తామన్నారు. కేంద్రం పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.1.75 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలను అందిస్తోందని, మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలియజేశారు. మళ్లీ తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేది ఇందిరమ్మ ఇళ్ల పథకమేనని భరోసా వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ‘గృహలక్ష్మి’ పథకం కింద అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సాయాన్ని అందించనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.


  • పథకం అమలుకు 16 శాఖల ఇంజినీర్లు

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థను బలోపేతం చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. పథకం పర్యవేక్షణకు మండల స్థాయిలో ఏఈ, నియోజకవర్గ స్థాయిలో డీఈ, జిల్లా స్థాయిలో ఎస్‌ఈ ఉండేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. గృహ నిర్మాణశాఖలో సరిపోయినంత మంది ఇంజినీర్లు లేరని, అందువల్ల, దాదాపు 16 ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఆయా శాఖల్లోని ఇంజినీర్లను ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పర్యవేక్షించేందుకు నియమించనున్నట్టు వెల్లడించారు.

Updated Date - Nov 03 , 2024 | 03:26 AM