Ponguleti: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి చట్టం మాకు రెఫరెండం
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:25 AM
ఎన్నో సమావేశాలు, చర్చలు, సంప్రదింపుల తర్వాతే భూ భారతి చట్టాన్ని రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పనితీరుకు భూ భారతి రెఫరెండంగా నిలుస్తుందన్నారు.

ఈ చట్టం మాకు శ్రీ రామరక్ష
ధరణితో పోయిన భూములు భూభారతితో హక్కుదారుల సొంతం
మండలిలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎన్నో సమావేశాలు, చర్చలు, సంప్రదింపుల తర్వాతే భూ భారతి చట్టాన్ని రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పనితీరుకు భూ భారతి రెఫరెండంగా నిలుస్తుందన్నారు. మండలిలో భూ భారతి బిల్లుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడారు. భూ భారతి చట్టం తమ ప్రభుత్వానికి శ్రీ రామరక్షగా నిలుస్తుందని చెప్పారు. ‘‘మనిషికి అన్నింటికంటే విలువైంది భూమి. ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది, ప్రాణప్రదమైంది భూమి ఒక్కటే’’ అని ఆయన పేర్కొన్నారు. మనిషికి తన భూమి అంటే ప్రాణమని, అలాంటి ప్రాణాన్ని యమధర్మరాజులాంటి ధరణి తీసుకుపోతే వారి గతి ఏమిటి? యముడి నుంచి తెలివిగా తన భర్త ప్రాణాలు తెచ్చుకున్న సతీసావిత్రిలాగా ఇప్పుడు భూ భారతితో ధరణిలో పోయిన భూములు తిరిగి హక్కుదారులకు చేర్చే పరిస్థితి ఏర్పడిందని మంత్రి వివరించారు.
గత నియంతృత్వ ప్రభుత్వం నలుగురికోసం ఒకరిద్దరుకలిసి చట్టాన్ని తయారు చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 4కోట్ల మంది కోసం అందరి అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలు, సలహాలు, ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని చట్టం రూపొందించామని తెలిపారు. ‘భూ భారతి రానున్నకాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శికానుంది. భూ భారతి ప్రజామోదం పొందిందన్న ఉక్రోషంతో బీఆర్‌ఎ్‌సకు నిద్రపట్టడం లేదు. భూ భారతి భూ యజమానుల జీవితాల్లో సరికొత్త కాంతుల్ని ప్రసరింపజేస్తుంది. ఇది అమల్లోకి వస్తే... బీఆర్‌ఎస్ పెద్దలు దోచుకున్న భూముల వివరాలు బయటపడతాయి’ అని మంత్రి అన్నారు. 2020 నూతన రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్.. కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన నాటి సీఎం కేసీఆర్.. తెలంగాణ సమాజంలో సృష్టించిన విధ్వంసం ఏంటో అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత ముగింపు పలికేలా భూ భారతి చట్టాన్ని తెచ్చామని మంత్రి వివరించారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టాలను పూర్తిగా అధ్యయనం చేసి ఈ నూతన చట్టానికి ప్రాణం పోశామన్నారు. దేశంలోనే నంబర్‌వన్‌గా, రోల్‌మోడల్‌గా భూ భారతి చట్టం నిలుస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు.