Ponguleti : ఏడాది కిందటే బీఆర్‌ఎస్‌కు ‘డిశ్చార్జి షీట్’
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:51 AM
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై ప్రజలు విసుగుచెంది ఏడాది కిందటే ఆ పార్టీకి ‘డిశ్చార్జి షీట్’ ఇచ్చారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు.
పదేళ్ల పాలనతో ప్రజలు విసుగుచెందారు
4.68 లక్షల ధరణి దరఖాస్తుల పరిష్కారం
రెవెన్యూ వ్యవస్థపై 3 రోజుల్లో నిర్ణయం
ప్రగతి నివేదిక విడుదలలో పొంగులేటి
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై ప్రజలు విసుగుచెంది ఏడాది కిందటే ఆ పార్టీకి ‘డిశ్చార్జి షీట్’ ఇచ్చారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రె్‌సపై బీఆర్‌ఎస్ వేసిన చార్జిషీట్‌పై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం పొంగులేటి సచివాలయంలో ప్రగతి నివేదికను విడుదల చేసి, మీడియాతో మాట్లాడారు. పోలీసులను పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయించడం, డబ్బు మూటలు పట్టుకొచ్చిన వారిని తప్ప ఎవరినీ కలవకపోవడం, ప్రజలు నోరు తెరవకుండా ధర్నా చౌక్‌లను ఎత్తేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. ఎర్రవెల్లిని రాజధానిగా, ఫాంహౌ్‌సను సచివాలయంగా చేసుకుని ఎవరి మాటా వినకుండా రాష్ట్రాన్ని తన ఇష్టమొచ్చినట్లు పాలించిన కేసీఆర్.. ఆధునిక తుగ్లక్ అని విమర్శించారు. ప్రజల మధ్య ఉండి పాలన చేసే వారు తుగ్లక్కా.. ఫాంహౌ్‌సలో ఉండి పాలించినవారు తుగ్లక్కా అని ప్రశ్నించారు. తుగ్లక్ అంటే ఇలా ఉంటాడని పదేళ్ల పాటు ప్రజలకు సినిమా వేసి మరీ చూపించారన్నారు.
సామాన్యులకు అందుబాటులోకి..
రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల ప్రగతి నివేదికను పొంగులేటి విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి 2.46 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1.38 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరణి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజల్లో విశ్వాసం ఏర్పడడంతో కొత్తగా 3.16 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటివరకు వచ్చిన మొత్తం 5.62 లక్షల దరఖాస్తుల్లో 4.68 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని వివరించారు. గత ప్రభుత్వం వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దుచేసి గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని పొంగులేటి విమర్శించారు. రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు వచ్చే నాలుగేళ్లలో సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. మొదటి విడతలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉండిపోయిన 34,544 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రూ.305 కోట్లతో పూర్తి చేసి అర్హులకు అందజేస్తామన్నారు.