Renuka Chowdhury: హడావిడిగా రామ్ లల్లా ప్రతిష్ఠాపన, రేణుకా చౌదరి విసుర్లు
ABN , Publish Date - Jan 18 , 2024 | 02:34 PM
రాముడిని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని వివరించారు. హడావిడిగా 22వ తేదీన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని శంకరాచార్యులు, మఠాధిపతులు వ్యతిరేకించారని తెలిపారు.
ఖమ్మం: అయోధ్య రాముడిని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి (Renuka Chowdhury) సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని వివరించారు. హడావిడిగా 22వ తేదీన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని శంకరాచార్యులు, మఠాధిపతులు వ్యతిరేకించారని తెలిపారు. తమ స్వార్థం కోసం హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నాడు రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడారు.
హిందువు ఎలా ఉండాలో బీజేపీ నేతలు చెబితే నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని రేణుకా చౌదరి అన్నారు. శ్రీరాముడిని దర్శించుకోవడానికి బీజేపీ నేతల అనుమతి అవసరం లేదన్నారు. రాముడి దర్శనం కోసం ఆహ్వానం ఉంటే చాలు అని చెప్పడానికి బీజేపీ నేతలకు ఏ అర్హత ఉందని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీరాముడిని దర్శించుకుంటామని తెలిపారు. రాముడు చూపిన బాటలో నడుస్తున్నామని వివరించారు.
జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టేందుకు గల కారణాన్ని రేణుకా చౌదరి వివరించారు. 22 తర్వాత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని తెలిపారు. అంతకుముందు ప్రాణ ప్రతిష్ఠ చేయడంతో ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ సారి ఎన్నికలకు రాముడిని అస్త్రంగా వాడుకోవాలని బీజేపీ అనుకుంటుందని పేర్కొన్నారు. వారి ఆటలు ఇక సాగవని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.