Rakesh Reddy: విజిట్ వీసాపై సౌదీ వెళ్లి మృత్యువాత
ABN , Publish Date - Aug 20 , 2024 | 05:33 AM
దళారుల మాటలు నమ్మి 30 రోజుల విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన తెలంగాణ వాసి నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మరణించిన అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
గల్ఫ్‌లోనే ఇందూరు కూలీ మృతదేహం
ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చొరవతో స్వదేశానికి..
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): దళారుల మాటలు నమ్మి 30 రోజుల విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన తెలంగాణ వాసి నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మరణించిన అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చొరవ చూపడంతో ఆ మృతదేహాన్ని తెలంగాణకు పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఉప్పు రవి నాలుగేళ్ల క్రితం 30 రోజుల విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చాడు. కూలీ పనులు చేసుకుంటూ ఇక్కడే ఉన్న అతడు అనారోగ్యంతో పదిహేను రోజుల క్రితం చనిపోయాడు. అతడితో పాటు గదిలో ఉన్నవారందరి వీసా గడువు ముగిసి ఉండటంతో పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడానికి భయపడ్డారు. దీంతో కేసు విచారణలో జాప్యం జరిగింది.
మృతుడి కుటుంబ సభ్యులు విషయాన్ని ఆర్మూర్ శాసన సభ్యుడు పైడి రాకేశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సౌదీలోని తన మిత్రులతో పాటు భారతీయ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని పంపించడానికి అవసరమైన నిధులను కూడ ఎంబసీ ద్వారా కేటాయించేలా సంప్రదింపులు జరిపారు. దీంతో రవి మృతదేహాన్ని బుధవారం స్వదేశానికి పంపించేందుకు వీలుగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి.