Share News

TG: 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం..

ABN , Publish Date - May 31 , 2024 | 05:55 AM

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్‌ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.

TG: 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం..

  • 3 చరణాలతో కూడిన 2:30 నిమిషాల నిడివి గల వెర్షన్‌ ఆవిష్కరణ

  • 13:30 నిమిషాల నిడివితో పూర్తి వెర్షన్‌ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తాం క్యాబినెట్‌ నిర్ణయంతోనే ఓకే: రేవంత్‌

  • తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం ఇంకా ఖరారు కాలేదని తెలిపిన సీఎం

  • జూన్‌ 2న.. రెండు పూటలా వేడుకలు

  • అందెశ్రీ, కీరవాణికి సర్కారు సన్మానం

  • ఈ వేడుకల్లో పాల్గొననున్న సోనియా రాహుల్‌ లేదా ప్రియాంక.. వచ్చే చాన్స్‌

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్‌ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది. కాగా.. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ అనంతరం ఐదు నిమిషాలపాటు ఆమె ప్రసంగించనున్నారు. సోనియాతో పాటు రాహుల్‌, ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా.. జూన్‌ 2న ఉదయమే కాక.. సాయంత్రం కూడా పలు కార్యక్రమాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆరోజు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్‌ అమర వీరులకునివాళులర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్లీ సాయంత్రం ట్యాంక్‌బండ్‌ వద్ద కార్నివాల్‌తో వేడుకలు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగియనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు సీఎం రేవంత్‌ ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఆ తర్వాత జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌పై దాదాపు 5వేల మంది భారీ ఫ్లాగ్‌ వాక్‌ నిర్వహించనున్నారు. ఈ ఫ్లాగ్‌ వాక్‌ జరుగుతున్న సమయంలో.. 13:30 నిమిషాల నిడివితో ఉన్న ‘‘జయ జయహే తెలంగాణ’’ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాత్రి 8:50 గంటల నుంచి 9 గంటల దాకా.. అంటే పది నిమిషాల పాటు.. చుట్టుపక్కల లైట్లన్నీ ఆఫ్‌ చేసేసి బాణసంచా కాలుస్తారు. దీంతో వేడుకలు ముగుస్తాయి. అనంతరం.. రాష్ట్ర గీతాన్ని రచించిన కవి, రచయిత అందెశ్రీని.. దానికి స్వరకల్పన చేసిన సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిని.. రాత్రి 8:44 నుంచి 8:50 గంటల మధ్య ప్రభుత్వం సన్మానించనుంది.


మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ..

రాష్ట్రావిర్భావ దశాబ్ది వేడుకలు, రాష్ట్ర గీతం తదిరత అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డి సచివాలయంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌, జూపల్లి, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు ఎం.ఎం కీరవాణి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ బిల్లు ఆమోదించిన సమయంలో లోక్‌సభలో ఉన్న అప్పటి ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఆ వేడుకల్లోనే.. రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను జాతికి అంకితం చేస్తామన్నారు. ఉద్యమకాలంలో అందరినీ ఉర్రూతలూగించి, తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో, క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్రగీతంగా ఆమోదించామని సీఎం తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన ఈ గీతాన్ని యధాతఽఽథంగా ఉంచామని స్పష్టం చేశారు. అయితే.. ఈ గీతాన్ని రెండున్నర నిమిషాలు, 13:30 నిమిషాల నిడివితో రెండు వెర్షన్లలో రూపొందించామని.. వీటిలో 3 చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల గేయం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా ఉంటుందని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని.. వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లతోపాటు అన్ని ప్రభుత్వ సంస్థలనూ ‘టీజీ’గా మార్చామని సీఎం గుర్తుచేశారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.


500 నమూనాలు..

తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. ఈ చిహ్నం తుది రూపు సంతరించుకుని అందరి ఆమోదం పొందితే జూన్‌ 2నాడే విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే.. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి తమకు 500 నమూనాలు వచ్చాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. వాటిపై చర్చలు జరుగుతున్నాయని.. చిహ్నానికి సంబంధించి ఇంకా తుది రూపమేదీ ఖరారు కాలేదని స్పష్టంచేశారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందన్నారు.


చార్మినార్‌ ఉండాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మజ్లిస్‌

తెలంగాణ సుదీర్ఘ చరిత్ర, సమ్మిళిత సంస్కృతికి ప్రతీకగా నిలిచిన చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక చిహ్నంలో కొనసాగించాలని ప్రభుత్వానికి మజ్లిస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ను అధికార చిహ్నం నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మజ్లిస్‌ నేతలు స్పందిస్తూ.. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తప్పకుండా ఉంచాలని డిమాండ్‌చేశారు.


సోషల్‌ మీడియాలో.. ‘రాష్ట్ర చిహ్నం’ వైరల్‌

ప్రస్తుత రాష్ట్ర చిహ్నన్ని మార్చబోతున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి దానిపై తీవ్ర చర్చ మొదలైంది. చిహ్నంలో... చార్మినార్‌, కాకతీయ కళాతోరణాన్ని తొలగించి తెలంగాణ ఉద్యమ స్పూర్తి, వ్యవసాయరంగం ప్రతిబింబించేలా నూతన రాజముద్ర ఉంటుందంటూ ప్రభుత్వ పెద్దలు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంశాల ఆధారంగా రూపొందించిన ఓ చిహ్నం గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అమరుల స్థూపం, చుట్టూ వరి కంకులు, మూడు సింహాలు, అశోకచక్రంతో కూడిన ఓ చిహ్నన్ని రూపొందించి అదే ప్రభుత్వం జూన్‌ 2న విడుదల చేయబోయే రాష్ట్ర చిహ్నమంటూ ప్రచారం చేశారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ రాజముద్రపై స్పందించిన సర్కారు పెద్దలు... అది నకిలీదని, రాష్ట్ర చిహ్ననికి సంబంధించిన ప్రక్రియ ఇంకా నమూనాల దశలోనే ఉన్నదని స్పష్టతనిచ్చారు.


అమరుల కుటుంబాలకు ఆహ్వానాలు

  • ఘనంగా ఆవిర్భావ ఉత్సవాలు

  • రాష్ట్ర స్థాయిలో పరేడ్‌ గ్రౌండ్‌లో కార్యక్రమం

  • రాత్రి 7గంటలకు ట్యాంక్‌బండ్‌పై వేడుకలు

  • జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో జాతీయ జెండా ఆవిష్కరణలు

  • విస్తృతంగా ఏర్పాట్లు: సీఎస్‌ శాంతికుమారి

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరు కావాలని అమరుల కుటుంబ సభ్యులు, ఉద్యమకారులకు ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా ఆహ్వానాలు పంపుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అలాగే, అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జూన్‌ 2న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ వద్ద అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సందర్శకుల కోసం ఫుడ్‌ కోర్టులు, షాపింగ్‌ స్టాల్స్‌, గేమింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడికి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రతి శాఖ నుంచి ఒక నోడల్‌ అధికారిని నియమించి, అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పార్కింగ్‌, బందోబస్తుకు తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని, తొలుత అమరులకు నివాళులర్పించాలని అన్నారు. కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించాలన్నారు.


ఆయా శాఖల ఆధ్వర్యంలో పనులు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఆయా శాఖల అధికారులు ఇప్పటికే పనులు ప్రారంభించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో ముఖ్య అతిథులు, ఆహ్వనితులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా లాంజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఎక్కువ స్థలంలో టెంట్‌లు వేస్తున్నారు. ప్రత్యేక మెడికల్‌ క్యాంపులతోపాటు తాగునీరు అందుబాటులో ఉంచనున్నారు. సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్ర్కీన్లు, ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌ 2వ తేదీ సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పోలీస్‌ కార్నివాల్‌, జయజయహే తెలంగాణ గీతంతో ఫ్లాగ్‌ వాక్‌ నిర్వహించనున్నారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన సాంస్కృతిక కళా బృందాలతో ప్రదర్శనలు ఉండనున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. సందర్శకుల వినోదం కోసం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తున్న 80 స్టాళ్లు శనివారం నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టాళ్లను రెండు రోజుల పాటు తెరిచి ఉంచనున్నారు.


రాష్ట్ర గీతం ఇదే..!

అందెశ్రీ కలం నుంచి జాలువారిన ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో పలు మార్పులు, చేర్పులతో ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఆమోదించింది. 2004లో అందెశ్రీ రాసిన గీతానికి అప్పట్లోనే మార్పులు చేసి, గాయకుడు రామకృష్ణతో రికార్డు చేయించారు. అలా మార్చిన గీతంలో రేవంత్‌ సర్కారు పలు పదాలు, చరణాలను జోడించింది. అప్పట్లో పల్లవిలో ‘పది జిల్లల నీ పిల్లలు’ అనే చోట ‘పదపదాన నీ పిల్లలు’ అని మార్చింది. అదేవిధంగా తెలంగాణను పాలించిన గొప్ప రాజవంశాల్లో ఒకటైన శాతవాహన వంశస్థుడు, కవిరాజు హాలుడు రాసిన ‘గాథా సప్తశతి’కి, శాతవాహనుల ఆస్థాన కవి గుణాఢ్యుడి ‘బృహత్కథా మంజరి’ (ఇందులోని 25 బేతాల కథలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి) గురించి రాష్ట్ర గీతంలో ప్రస్తావించారు. 2004లో రికార్డయిన గీతంలో ‘పోతనదీ పురిటిగడ్డ’ అని ఉండగా.. తాజా గీతంలో పోతనతోపాటు.. బద్దెన, భీమకవి, పాలకుర్కి సోమనాథుడు, కంచర్లగోపన్న(భక్త రామదాసు), కాళిదాసు కావ్యాలకు భావాలను రాసిన మల్లినాథ సూరి, వాణీ నా రాణి అన్న పిల్లలమర్రి పినవీరభద్రుడు వంటి వారికి స్థానం కల్పించారు. ఇక తెలంగాణ చరిత్రలో బౌద్ధం కూడా భాగంగా ఉండేదనడాన్ని గుర్తుచేస్తూ ధూళికట్ట (ఇక్కడ శాసనాలు బయటపడ్డాయి) దిజ్ఞాగుడి గురించి ప్రస్తావించారు. పాత గీతంలో రుద్రమ్మ గురించి మాత్రమే ఉండగా.. ఇప్పుడు రేచర్ల పద్మనాయకుల వంశానికి చెందిన పాలకుడు సర్వజ్ఞ సింగభూపాలుడిని చేర్చారు. సమ్మక్క-సారలమ్మ, సర్వాయి పాపన్న, గిరిజన వాయిద్యాలకు, జానపద గాయకుడు పండుగోల్ల సాయన్న వంటి వారికి చోటు కల్పించారు. ఈ గీతాన్ని రెండు వెర్షన్లుగా రికార్డు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, విద్యాసంస్థలు ఆలపించడానికి వీలుగా రెండున్నర నిమిషాల నిడివి ఉన్న వెర్షన్‌తోపాటు.. మొత్తం పాటతో కూడిన పదమూడున్నర నిమిషాల నిడివిగల గల రెండో వెర్షన్‌ను రేవంత్‌ సర్కారు ఆమోదించింది.


ఉద్యమ కాలంలో గాయకుడు రామకృష్ణ పాడిన గీతం.. ఇప్పుడు మరికొన్ని చరణాలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం

ఆమోదించిన గీతం.. రెండూ యధాతథంగా..

  • ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్ర గీతం (పదమూడున్నర నిమిషాలు)

1) జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరితగల తల్లీ నీరాజనం

పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

2) పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి

భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి

హాలుని గాథాసప్త శతికి ఆయువులూదిన నేల

బృహత్కథల తెలంగాణ కోటి లింగాల కోన

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

3) ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించాలని

తెలుగులో తొలి ప్రజాకవి ’పాలకుర్కి’ సోమన్న

రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి

కవి రాజై వెలిగె దిశల ’కంచర్ల గోపన్న’

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

4) కాళిదాసు కావ్యాలకు భావాలను రాసినట్టు

మల్లినాథ సూరి మా మెతుకు సీమ కన్నబిడ్డ

ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు

దిజ్ఞాగుని గన్న నేల ఢీకొట్టడమే జన్మహక్కు

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

5) ’పోతన’దీ పురిటి గడ్డ ’రుద్రమ’దీ వీరగడ్డ

గండర గండడు ’కొమురం భీముడే’ నీ బిడ్డ

కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప

గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

6) రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల

‘సర్వజ్ఞ సింగభూపాలుని’ బంగరు భూమి

వాణీ నా రాణి అంటు నినదించిన కవి కులరవి

పిల్లల మర్రి పిన వీరభద్రుడు మాలో రుద్రుడు

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

7) సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు

సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు

ఉరూర పాటలైన ‘మీర సాబు’ వీరగాథ

దండు నడిపే పాలమూరు ‘పండుగోల్ల సాయన్న’

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

8) కవిగాయక వైతాళిక కళల మంజీరాలు

డప్పు, ఢమరుకము, డక్కి, శారద స్వర నాదాలు

పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ

అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

9) జానపదా జనజీవన జావళీలు జాలువార

జాతిని జాగృతపరచే గీతాల జన జాతర

వేల కొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి

తరగనిదీ నీ త్యాగం మరుపనిదీ శ్రమయాగం

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

10)బడుల గుడులతో పల్లెల ఒడులు పులకరించాలి

విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి

తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక

ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మ మెలగాలి

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

11) సిరి వెలుగులు జిమ్మే సింగరేణి నల్ల బంగారం

అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం

సహజమైన మన సంపద సక్కనైన పువ్వుల పొద

సిరులుపండె సారమున్న మాగాణమె కదా నీ యెద

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

12) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా

పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి

ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న

రాష్ట్ర గీతం. మొత్తం గీతంలోని

మూడు చరణాలతో రూపొందించారు

1) జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరితగల తల్లీ నీరాజనం

పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

2) జానపద జనజీవన జావళీలు జాలువార

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర

అను నిత్యము నీ గానం అమ్మనీవే మా ప్రాణం

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

3) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా

పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

ఉద్యమకాలంలో గాయకుడు రామకృష్ణతో

పాడించి రికార్డు చేసిన గీతం...

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరిత గల తల్లీ నీరాజనం

పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

పోతనదీ పురిటి గడ్డ రుద్రమదీ వీరగడ్డ

గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప

గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం

అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం

సహజమైన వనసంపద చక్కనైన పూవుల పొద

సిరులు పండే సారమున్న మాగాణమె కద నీ ఎద

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జానపద జన జీవన జావళీలు జాలువార

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృతిపరిచే గీతాల జన జాతర

అనునిత్యం నీ గానం, అమ్మ నీవె మా ప్రాణం

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె

పచ్చని మాగాణంలో పసిడి సిరులు పండాలె

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలె

స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

Updated Date - May 31 , 2024 | 06:51 AM