Election Commission: పంచాయతీ ‘ఓటరు జాబితా’కు షెడ్యూల్
ABN , Publish Date - Aug 22 , 2024 | 04:21 AM
గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై స్పష్టత లేనప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితా రూపకల్పనపై దృష్టి సారించింది.
6న ముసాయిదా జాబితా తయారీ
21న తుది ఓటరు జాబితా ప్రచురణ
షెడ్యూల్ విడుదల చేసిన ఎస్‌ఈసీ
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై స్పష్టత లేనప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితా రూపకల్పనపై దృష్టి సారించింది. ఇందుకుగాను గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎ్‌సఈసీ) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబరు 6న జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు), మండల అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) ఆధ్వర్యంలో వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటరు జాబితాలను ఆయా పంచాయతీల్లో ప్రచురిస్తారు.
ఆ జాబితాలపై జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవోలు అదేనెల 9, 10వ తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, వారి సూచనలు స్వీకరిస్తారని ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే సెప్టెంబరు 7 నుంచి 13 వరకు డీపీవో, ఎంపీడీవోలు వాటిని స్వీకరించి 19వ తేదీలోపు పరిష్కరిస్తారని వెల్లడించారు. 21న వార్డులు, పంచాయతీల వారీగా తుది ఓటరు జాబితాను ప్రచురించాలని షెడ్యూల్‌లో తెలిపారు.
అధికారులతో ఎస్‌ఈసీ పార్థసారథి సమీక్ష
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు చేపట్టాల్సిన 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా వార్డులు, గ్రామ పంచాయతీ వారీగా ఓటరు జాబితా తయారీ, ప్రచురణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వార్డులు, పంచాయతీల వారీగా ఓటరు జాబితాను రూపొందిస్తున్నట్లు తెలిపారు.