Telangana Tourism: ‘బుద్ధవనం’ సందర్శనకు రెండు రోజుల టూర్
ABN , Publish Date - Aug 31 , 2024 | 03:21 AM
బౌద్ధుల ఆధ్మాత్మిక కేంద్రంగా సుప్రసిద్ధమైన నాగార్జునసాగర్ బుద్ధవనంను సందర్శించే పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ కొత్తగా రెండు రోజుల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
ప్యాకేజీ ప్రకటించిన రాష్ట్ర పర్యాటక సంస్థ
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): బౌద్ధుల ఆధ్మాత్మిక కేంద్రంగా సుప్రసిద్ధమైన నాగార్జునసాగర్ బుద్ధవనంను సందర్శించే పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ కొత్తగా రెండు రోజుల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పటి వరకున్న హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్లి రాత్రి వరకు వచ్చే ప్యాకేజీకి బదులుగా వారాంతపు సెలవు రోజులు, ఇతర పని దినాల్లో బుద్ధవనంను సందర్శించేందుకు ఆసక్తి ఉన్న పర్యాటకుల కోసం వేర్వేరుగా రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది.
ఇందులో తొలిరోజు నాగార్జునసాగర్ జలాలపై క్రూయిజ్‌లో బయలుదేరి నీటి మధ్యన ద్వీపం కొండపై నిర్మించిన మ్యూజియంలో బుద్ధుని కాలం నాటి పురాతన బౌద్ధ మత శిల్పాలు, అరుదైన వస్తు సంపదను సందర్శించే అవకాశం కల్పిస్తారు. తిరిగి సాగర్ డ్యామ్ చేరుకుని రాత్రిపూట నల్లమల అటవీ ప్రాంత ప్రకృతి దృశ్యాలను సందర్శించడంతోపాటు రాత్రి బస చేయడానికి పర్యాటక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండో రోజు నాగార్జునసాగర్ డ్యామ్ సమీపంలో సుమారు 274ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ చారిత్రక వారసత్వ విధానంలో అద్భుతంగా అభివృద్ధి చేసిన ‘బుద్ధవనం ప్రాజెక్టు’ను సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
రోజంతా బుద్ధవనంలో పర్యటించి బౌద్ద వారసత్వ ప్రాశస్త్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల బుద్ధవనంలో పర్యాటకులకు వసతి సౌకర్యాలను కల్పించిన పర్యాటక సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి పర్యాటక సంస్థ నాగార్జునసాగర్ వరకు బుద్ధవనం ప్రాజెక్టు టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రతి రోజూ ఏసీ బస్సును నడుపుతోంది. వివరాలకు 9666651561, 9848125720 సంప్రదించవచ్చని సంస్థ అధికారులు తెలిపారు. చార్జీల విషయానికొస్తే.. సాధారణ రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) పెద్దలు ఒక్కొక్కరికి రూ.2,600, పిల్లలకు రూ.2,100, వీకెండ్ (శుక్రవారం నుంచి ఆదివారం వ రకు)లో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.3,400, పిల్లలకు రూ.2,700.