Hyderabad: అల్లు అర్జున్‌కు బెయిల్‌! | TG High Court Grants Four-Week Interim Bail to Allu Arjun in Stampede Case
Share News

Hyderabad: అల్లు అర్జున్‌కు బెయిల్‌!

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:20 AM

పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో నిందితుడు, సినీ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ ప్రసాదించింది.

Hyderabad: అల్లు అర్జున్‌కు బెయిల్‌!

4 వారాలు ఊరట.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. జైలుకు వెళ్లిన కొద్ది గంటల్లోనే విడుదలకు ఆదేశం

  • ‘హత్య చేసే ఉద్దేశంతో దాడి’ ఇక్కడ లేదు

  • క్వాష్‌ పిటిషన్‌లో మధ్యంతర బెయిలివ్వొచ్చు

  • తీర్పు సందర్భంగా జస్టిస్‌ శ్రీదేవి వ్యాఖ్యలు

  • తొక్కిసలాట పోలీసుల వైఫల్యమే..

  • అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది

  • క్వాష్‌ పిటిషన్‌లో బెయిలివ్వడం ఏంటి?

  • నటుడైతే లంచ్‌ మోషన్‌ ఇస్తారా?

  • వ్యతిరేకించిన ప్రభుత్వ న్యాయవాది

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో నిందితుడు, సినీ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ ప్రసాదించింది. ఈ కేసులో శుక్రవారం ఆయన అరెస్టయి జైలుకు వెళ్లిన కొద్ది గంటల్లోనే బెయిలు లభించింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్య చేసే ఉద్దేశంతో దాడి చేయడం, ఉద్దేశ పూర్వకంగా పదునైన ఆయుధాలతో దాడి చేయడం వంటి సెక్షన్లు ప్రస్తుత కేసుకు వర్తించవని హైకోర్టు పేర్కొంది. నిర్లక్ష్యం వల్ల మరణం జరిగిందనుకున్నా ఆ నేరానికి పడే గరిష్ఠ శిక్ష ఐదేళ్లే కాబట్టి బెయిల్‌కు పిటిషనర్‌ అల్లు అర్జున్‌ అర్హుడని పేర్కొంది. ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే కేసుల్లో అరెస్ట్‌ అవసరం లేదు కాబట్టి.. ఇది బెయిలబుల్‌ కేసేనని జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం పేర్కొంది. ‘మొదట ఈ కేసులో లంచ్‌ మోషన్‌ విచారణకు అనుమతి ఇవ్వొద్దని అనుకున్నాను. సామాన్య పౌరులు అయితే లంచ్‌ మోషన్‌ ఇద్దామనుకున్నాను. సెలబ్రిటీ అయినందుకు పిటిషనర్‌ స్వేచ్ఛను కోల్పోవాలా? అనే ప్రశ్న భోజన విరామం సమయంలో నన్ను తొలచివేసింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సెలబ్రిటీ అయినందుకు పిటిషనర్‌ స్వేచ్ఛను కోల్పోతుంటే చూస్తూ ఉండటం సమంజసం కాదని అనిపించింది’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ‘‘అర్నబ్‌ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ హైకోర్టులో ఇద్దరు జడ్జిలు క్వాష్‌ పిటిషన్‌లో బెయిల్‌ మంజూరు చేశారు. ఒకటి 489ఎ వ్యవహారంలో ఒక సామాన్యునికి బెయిల్‌ లభించింది. బండి సంజయ్‌ కేసులో దిగువ కోర్టు రిమాండ్‌ విధించినప్పటికీ ఇదే హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ బెయిల్‌ మంజూరు చేశారు. క్వాష్‌ పిటిషన్‌లో సైతం బెయిల్‌ మంజూరు చేయవచ్చు. పరిమితంగా నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ఇస్తున్నాం. ఆలోపు పిటిషనర్‌ తన ఎదుట ఉన్న న్యాయపరమైన అంశాలను వినియోగించుకోవచ్చు’’ అని ధర్మాసనం పేర్కొంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు సంధ్య థియేటర్‌ యజమానులకు సైతం మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. సంధ్య థియేటర్‌ యజమానుల్లో అరెస్ట్‌ కాకుండా ఉన్న మిగతా యజమానులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని స్పష్టంచేసింది. పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా అక్కడ విపరీతమైన రద్దీ ఉంటుందని తెలిసి సాధారంగా ఎవరైనా దూరంగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది.


పోలీసులదే పూర్తి తప్పు: అర్జున్‌ న్యాయవాది

పుష్ప సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా జనాన్ని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన పోలీసులు ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అల్లు అర్జున్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్‌.నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి అక్కడ చాలా తక్కువ మంది పోలీసులు బందోబస్తుకు వచ్చారన్నారు. వారు కూడా అల్లు అర్జున్‌ను, సినిమాను చూడటానికి పోటీ పడ్డారని, జనాన్ని అదుపు చేసే విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారని, పోలీస్‌ స్టేషన్‌లో అల్లు అర్జున్‌ను చూడవచ్చని వారు భావించారని ఆరోపించారు. అర్నబ్‌ గోస్వామి కేసులో బాంబే హైకోర్టు బెయిల్‌ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దానిని సవరించిందని పేర్కొన్నారు. అర్నబ్‌ గోస్వామి తీర్పు ఆధారంగా ఈ హైకోర్టు ఇప్పటికే రెండు సందర్భాల్లో క్వాష్‌ పిటిషన్‌లో బెయిల్‌ మంజూరు చేసిందని గుర్తు చేశారు. షారుఖ్‌ ఖాన్‌ ఓ సినిమా ప్రమోషన్‌ కోసం రైల్లో ప్రయాణించినపుడు ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని, దుర్ఘటన జరగాలనే ఉద్దేశం షారుఖ్‌ ఖాన్‌కు లేదు కాబట్టి ఆయనకు సుప్రీంకోర్టు ఊరట కల్పించిందని గుర్తు చేశారు. మరణం సంభవించడం దురదృష్ట ఘటన అని, మొత్తం ఆసుపత్రి ఖర్చులు పిటిషనర్‌ భరించడంతో పాటు పరిహారం కూడా ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. ఈ దురదృష్టకర ఘటనను ఒకరిపైకి తోసేయడం ఎవరికీ మంచిది కాదన్నారు. ఇతర దేశాల్లో క్రీడలు, ఇతర వేడుకలు జరిగినపుడు పోలీసులు జనాన్ని అదుపు చేయడానికి చూస్తారని, ఇక్కడ పోలీసులు తామే ప్రేక్షకులయ్యేందుకు ఎక్కువ ఆసక్తి చూపారని వ్యాఖ్యానించారు.


అల్లు అర్జున్‌ వల్లే తొక్కిసలాట: పీపీ పల్లె నాగేశ్వర్‌రావు

అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌ను అత్యవసర కేసులకు మాత్రమే అవకాశమిచ్చే లంచ్‌ మోషన్‌లో విచారణకు అనుమతివ్వడాన్ని ప్రభుత్వ న్యాయవాది(పీపీ) పల్లె నాగేశ్వర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. సినీ నటుడు అయినంత మాత్రాన మధ్యాహ్నం 2.20 గంటలకు లంచ్‌ మోషన్‌ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. జడ్జి సమాధానమిస్తూ సంధ్య థియేటర్‌ యజమానుల కేసు ఇప్పటికే లిస్ట్‌లో ఉందని, దాంతో పాటు వింటామని చెప్పారు. రిమాండ్‌ రిపోర్ట్‌ కాపీ సైతం తమ వద్ద లేదని, వాదనలు వినిపించడానికి మరికొంత సమయం కావాలని పీపీ కోరారు. కావాలంటే వారు హౌస్‌ మోషన్‌ వేసుకోవచ్చని, తమకు మాత్రం సోమవారం వరకు సమయం కావాలని చెప్పారు. క్వాష్‌ పిటిషన్‌లో బెయిల్‌ ఇవ్వరాదని, రెగ్యులర్‌ బెయిల్‌ దాఖలు చేసుకునే అవకాశం అల్లు అర్జున్‌కు ఉందని, మధ్యంతర బెయిల్‌ కోసం వారు దాఖలు చేసిన అప్లికేషన్‌కు నెంబర్‌ కూడా కాలేదని, ఇంత హడావుడిగా మధ్యంతర బెయిల్‌ ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌ వల్ల ఇప్పటికే ఒక మనిషి చనిపోగా, మృతురాలి కుమారుడు వెంటిలేటర్‌పై ఉన్నారని వ్యాఖ్యానించారు. వాద ప్రతివాదాల అనంతరం అల్లు అర్జున్‌కు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. క్వాష్‌ పిటిషన్‌లను రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఫిర్యాదుదారుడు అయిన మృతురాలి భర్తకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Dec 14 , 2024 | 03:20 AM