Share News

Rain Alert: ఆ టీమ్స్ ఎక్కడ..!!

ABN , Publish Date - Jul 04 , 2024 | 03:54 PM

మహానగరంలో వర్షం వచ్చిందంటే నరకమే. చిన్న వానకే రోడ్లన్నీ జలమయం అవుతాయి.

Rain Alert: ఆ టీమ్స్ ఎక్కడ..!!
Rains At Hyderabad

  • వానలొస్తున్నా పత్తాలేరు

  • క్షేత్రస్థాయిలో చురుగ్గా లేని ఎమర్జెన్సీ టీమ్స్

  • వరద పోటెత్తుతున్నా స్పందన కరవు

  • నిత్యం తప్పని వరద తిప్పలు

  • ఉన్నతస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ

  • ట్రాఫిక్‌ పోలీసులు, పౌరులే నీటి తొలగింపు


హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మహానగరంలో వర్షం వచ్చిందంటే నరకమే. చిన్న వానకే రోడ్లన్నీ జలమయం అవుతాయి. ఎక్కడ గుంత ఉందో, ఏ మ్యాన్‌హోల్‌ తెరిచి ఉంటుందో తెలియని దుస్థితి. ఒక్కోసారి 8 -10 సెం.మీ. వాన కురుస్తోంది. దీంతో నీరంతా రోడ్లపైకి చేరడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎప్పటికప్పుడు నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ, ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన మాన్‌సూన్‌ బృందాలు పనితీరు అస్తవ్యస్తంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో ఈ బృందాల పనితీరు సరిగ్గా ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. వందల సంఖ్యలో మాన్‌సూన్‌ టీమ్‌లు ఏర్పాటు చేసినా.. యేటా రూ.50-60కోట్లు ఖర్చు చేస్తోన్నా.. పరిస్థితి మారడం లేదు.


అత్యవసర బృందాలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన బృందాలు అందుబాటులో లేక ట్రాఫిక్‌ పోలీసులు వ్యర్థాలు తొలగిస్తోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో కాగితాల్లో మాత్రమే టీంలు ఉంటున్నాయని ఉన్నతాధికారులు గుర్తించారు. మాన్‌సూన్‌ టీంల పేరిట అక్రమాలు జరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. దీనికి చెక్‌ పెట్టేలా కార్మికుల ఆధార్‌ వివరాల నమోదు తప్పనిసరి చేశారు. అయినా కొన్ని చోట్ల అధికారుల పనితీరు మారలేదు.


అందుకే వరద నీరు

గ్రేటర్‌లో 200లకుపైగా వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు ఉన్నా.. భారీ స్థాయిలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు 140 ఉంటాయని అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు ఒక్కో టీం ఉండేలా ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. ఇదే నిజమైతే వర్షం పడిన వెంటనే అక్కడి బృందంలోని సభ్యులు క్షేత్రస్థాయిలో పని చేయాలి. క్యాచ్‌ పిట్ల వద్ద చెత్తా చెదారం తొలగించాలి. అవసరాన్ని బట్టి మూతలు తొలగించి వరద నీరు వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. కానీ కొన్ని చోట్ల అత్యవసర బృందాలు కనిపించడం లేదు. నమోదైన వర్షపాతాన్ని బట్టి సాధారణంగా నగర రహదారులపై వరద నీరు రెండు, మూడు గంటల్లో తొలగిపోతుంది. వీలైనంత త్వరగా వర్షపు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టేందుకు అత్యవసర బృందాలు ఏర్పాటు చేస్తారు.


మంత్రులు, ప్రముఖులు ఉండే ప్రాంతాల్లో వరద నీటి తొలగింపునకు ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు.. ఇతర ప్రాంతాల్లో బృందాలున్నాయా..? లేదా..? అన్నది పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కువ సమయం రోడ్లపై వరద నీరు ఉంటోంది. ఒక్కో వాటర్‌ లాగింగ్‌ పాయింట్‌లో ఒక్కో టీం ఉండేలా.. మేజర్‌ వాటర్‌ లాగింగ్‌ ఏరియాల వద్ద మోటార్‌ పంపులతో నీటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో వర్షం కురిసినప్పుడు ఉన్నతాధికారులతోపాటు జోనల్‌, సర్కిల్‌ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో మాన్‌సూన్‌ టీం ఉన్నాయా..? లేదా..? అన్నది పరిశీలించే వారు. ఇటీవలి కాలంలో అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు తగ్గాయి. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కమిషనర్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ వస్తే తప్ప.. అధికారులు రహదారులపై కనిపించడం లేదు.


జీహెచ్‌ఎంసీతోపాటు డీఆర్‌ఎఫ్‌, వాటర్‌బోర్డు, పోలీసులు, విద్యుత్‌ విభాగాలు మాన్‌సూన్‌ బృందాలు ఏర్పాటు చేశాయి. అన్ని విభాగాలు కలిపి 534 బృందాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.


మాన్‌సూన్‌ టీమ్‌ల వివరాలివి..

మొబైల్‌ - 157

స్టాటిక్‌ - 242

డీఆర్‌ఎఫ్‌ - 30

సీఆర్‌ఎంపీ - 29

టీజీఎస్పీడీసీఎల్‌ - 41

వాటర్‌బోర్డు - 22

పోలీస్‌- 13

Updated Date - Jul 04 , 2024 | 05:41 PM