Share News

MLC Election: తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతున్న పోలింగ్.. ఆ ముగ్గురు మధ్యే పోటీ..

ABN , Publish Date - May 27 , 2024 | 01:34 PM

తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

MLC Election: తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతున్న పోలింగ్..  ఆ ముగ్గురు మధ్యే పోటీ..
MLC Voters (File Photo)

తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఓటువేసేవాళ్లు అక్షరాస్యులు కావడంతో.. వాళ్లంతా అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేసే అవకాశం ఉండటంతో పార్టీలు వీటిపై పెద్దగా ఫోకస్ పెట్టేవికాదు. కానీ గత కొతంకాలంగా ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శాసనసభతో పాటు శాసనమండలిలోనూ తమ బలాన్ని చూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. 2021లో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేశారు. దీంతో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఉప ఎన్ని్క పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది.

Hyderabad: వేలం గ్యారెంటీ...


గతంలో పోలిస్తే తగ్గిన ఓటర్లు..

వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రస్తుతం 4 లక్షల 63 వేల 839 మంది ఓట్లర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2021తో పోలిస్తే దాదాపు 40 వేలమందికిపైగా ఓటర్లు తగ్గారు. గతంలో బోగస్ ఓట్లు నమోదయ్యాయంటూ అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి.. బోగస్ ఓట్లు తీసేయడంతో ఓట్ల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. బోగస్ ఓట్లతోనే గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారంటూ ప్రత్యర్థులు ఆరోపించారు. ప్రస్తుతం 40వేలకు పైగా ఓట్లు తగ్గడం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనేది ఫలితాల తర్వాత తేలనుంది. గత ఎన్నికల్లో 74 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈసారి ఎంత మేర పోలింగ్ జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.


ప్రధాన పోటీ ఎవరి మధ్య అంటే..

వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి 52మంది అభ్యర్థులు పోటీచేస్తున్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల మధ్యనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీచేస్తున్నారు. వీరితో పాటు స్వంతత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో విద్యావేత్త అశోక్, మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉద్యమకారుడు బక్క జడ్సన్ పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మల్లన్న రెండోస్థానంలో నిలిచారు. ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. దీంతో పార్టీ బలం తనకు కలిసొచ్చి విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. మరోవైపు తమ సిట్టింగ్ స్థానం కావడంతో తమ అభ్యర్థి గెలుస్తారని బీఆర్ఎస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ప్రశ్నించే గొంతుకను శాసనమండలికి పంపించాలనుకునే గ్యాడ్యుయేట్ ఓటర్లు తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని బీజేపీ అంటోంది. మొత్తానికి మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది జూన5న తేలనుంది.


Hyderabad: మళ్లీ కోతలు ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Telangana News and Telugu News

Updated Date - May 27 , 2024 | 01:41 PM