Share News

కొబ్బరి కారం

ABN , Publish Date - Dec 15 , 2024 | 10:05 AM

కావలసిన పదార్థాలు : ముదిరిన (పచ్చి) కొబ్బరి ముక్కలు - ఒక కప్పు, నూనె - 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 10, కరివేపాకు - గుప్పెడు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున, ధనియాలు - 1 టేబుల్‌ స్పూను, జీరా - ఒక టీ స్పూను, చింతపండు - 2 రెబ్బలు, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి - 15 రెబ్బలు.

కొబ్బరి కారం

కావలసిన పదార్థాలు : ముదిరిన (పచ్చి) కొబ్బరి ముక్కలు - ఒక కప్పు, నూనె - 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 10, కరివేపాకు - గుప్పెడు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున, ధనియాలు - 1 టేబుల్‌ స్పూను, జీరా - ఒక టీ స్పూను, చింతపండు - 2 రెబ్బలు, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి - 15 రెబ్బలు.


తయారుచేసే విధానం: కొబ్బరిని తడి లేకుండా ఒక రోజు ఎండలో ఉంచాలి. కడాయిలో ఒక టీ స్పూను నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు మాడకుండా దోరగా వేగించి పక్కనుంచాలి. మరో టీ స్పూను నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, నువ్వులు, జీరా, చింతపండు ఒకటి తర్వాత ఒకటి వేస్తూ అన్నీ వేగించాలి. కొబ్బరి ముక్కల్ని తడి లేకుండా కొద్దిసేపు వేగించాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో ఎండుమిర్చి మిశ్రమం, దినుసులు, ఉప్పు కలిపి పొడి చేయాలి. ఆనక కొబ్బరి ముక్కలు వేసి బరకగా పట్టుకోవాలి. చివరలో వెల్లుల్లి కలిపి పల్స్‌ మోడ్‌లో ఒకసారి తిప్పి చల్లారిన తర్వాత సీసాలో భద్రపరచాలి. ఇష్టమైతే ఇంగువతో తాలింపు పెట్టుకోవచ్చు. ఈ పొడి ఫ్రిజ్‌లో 3 నెలల పాటు నిలువ ఉంటుంది. అన్నం, ఇడ్లీ, ఉప్మాల్లోకి ఎంతో రుచిగా ఉండే కారం ఇది.


కీమా విత్‌ ఆలూమేతీ

కావలసిన పదార్థాలు: మటన్‌ కీమా - అరకేజీ, (చిన్న) మెంతికూర - అరకప్పు, బంగాళదుంపలు - పావు కేజీ, అల్లం వెల్లుల్లి - ఒక టేబుల్‌ స్పూను, కారం, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - అర కప్పు, నూనె - పావు కప్పు, ఉల్లి తరుగు - ఒక కప్పు, ధనియా, గరం మసాల పొడులు - అర టీ స్పూను చొప్పున.

book8.2.jpg


తయారుచేసే విధానం: ముందుగా కీమాను శుభ్రంగా కడిగి నీరు వడకట్టి పక్కనుంచాలి. కుక్కర్లో నూనె వేసి ఉల్లి తరుగు దోరగా వేగించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, మెంతికూర కలిపి రెండు నిమిషాలు పెద్ద మంటపై వేగించాలి. ఇప్పుడు కీమా వేసి అన్నీ బాగా కలిపి గ్లాసు నీరుపోయాలి. కుక్కర్‌ మూతపెట్టి మీడియం మంటపై 4 విజిల్స్‌ వచ్చాక స్టవ్‌ ఆపేయాలి. కుక్కర్‌ ప్రెజర్‌ పోయాక ఆలూ (పెద్ద ముక్కలు), పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి వేసి మరో విజిల్‌ వచ్చే వరకూ మంటమీద ఉంచి దించేయాలి. ఈ కర్రీ అన్నంతో పాటూ చపాతీల్లోకి కూడా ఎంతో బాగుంటుంది.

Updated Date - Dec 15 , 2024 | 10:08 AM